Minister Amarnath : కార్ రేసింగ్ పై.. మంత్రి అమర్నాథ్ గుడ్డు కథ…!
Minister Amarnath : హైదరాబాద్ నగరంలో ఫార్ములా కారు రేసు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కారు రేసింగ్ చూడటానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు నగరానికి వచ్చారు. అలా వచ్చిన వారిలో ఏపీ మంత్రి అమర్నాథ్ కూడా ఉన్నారు
హైదరాబాద్ నగరంలో ఫార్ములా కారు రేసు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కారు రేసింగ్ చూడటానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు నగరానికి వచ్చారు. అలా వచ్చిన వారిలో ఏపీ మంత్రి అమర్నాథ్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన ఆయన ఓ గుడ్డు కథ చెప్పడం విశేషం.
ఇంతకీ మ్యాటరేంటంటే… ఫార్ములా ఈ కారు రేస్ వీక్షించిన అనంతరం అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఈ రేసింగ్ కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను మెచ్చుకున్నారు. హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు రావడం గర్వకారణమన్నారు. హైదరాబాద్ ఈ స్థాయికి చేరడానికి తెలంగాణతో పాటు తెలుగు ప్రజల కృషి కూడా ఉందన్నారు. విశాఖ పట్నంను కూడా హైదరాబాద్ నగరం తరహాలో అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఏపీలో కూడా ఇలాంటి రేసు నిర్వహిస్తారా? అంటూ ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబు ఇస్తూ.. కోడి గుడ్డు పెడుతుంది.కానీ కోడిని పెట్టదు కదా.. కోడి గుడ్డు పెట్టాలి, పొదగాలి, పిల్లలు పెట్టాలి, పెరిగి పెద్దవ్వాలి. ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ లో కోడి.. గుడ్డు పెట్టింది. పెట్ట కింద మార్చడానికి టైమ్ పడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించే స్థాయికి చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి అమర్ నాథ్.