»Massive Rains For Andhra Pradesh Coming 3 Days Weather Update Is Here
Rains: వచ్చే మూడు రోజుల్లో ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల్లో ఈ కుండపోత వర్షాలు ఉంటాయని వెల్లడించింది. ఎక్కడెక్కడంటే?
Massive Rains For Andhra Pradesh : వచ్చే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు(Massive Rains) కురిసే అవకాశాలు ఉన్నాయి. మంగళ, బుధ వారాల్లో భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం తేలికపాటి జల్లులు కురిసే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది.
ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(meteorological department) వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్చరికల్ని జారీ చేసింది. పొలాల్లో పని చేసే కూలీలు, రైతులు, గొర్రెల కాపరుల్లాంటి వారు బహిరంగ వర్షం పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా ఉండటమే మంచిదని చెప్పింది. టవర్లు, పోల్స్, చెట్ల కింద ప్రజలు ఉండకుండా ఉండటమే క్షేమమని తెలిపింది. భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
సోమవారం తిరుపతి, అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, ఎన్టీఆర్, కృష్ణా ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో చెదురుమదురుగా వానలు పడే అవకాశం ఉంది. ఇక మంగళ, బుధవారాల్లో అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటు వర్ష సూచనలు ఉన్నాయి.