మొదలు పెట్టిన బీఆర్ఎస్… ఆరు రాష్ట్రాల్లో కిసాన్ సెల్స్…!
దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ అడుగుపెట్టారు. ఇప్పటి వరకు కేవలం తెలంగాణకు పరిమితమైన పార్టీని… జాతీయ పార్టీ గా మార్చేశారు. బీఆర్ఎస్ ని అన్ని రాష్ట్రాల ప్రజలకు దగ్గర చేసేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. జాతీయ పార్టీ ఆవిర్భావం నాడే.. ‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్’ అని నినదించిన కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ కార్యకలాపాలు, డిసెంబర్ నెలాఖరు నుంచి దేశ వ్యాప్తంగా ఊపందుకోనున్నాయి. అందులో భాగంగా పలు రాష్ట్రాల్లో బిఆర్ఎస్ కిసాన్‌సెల్ లను ప్రారంభించాలని కెసిఆర్ నిర్ణయించారు.
ముందస్తుగా 6 రాష్ట్రాల్లో బిఆర్ఎస్కే కార్యకలాపాలను ప్రారంభం కానున్నాయి. తద్వారా బిఆర్ఎస్ జాతీయ స్థాయిలో తన వాణిని వినిపిస్తూ, దేశ ప్రజలను ఆకర్షిస్తూ చారిత్రక దశలో తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించనుంది. డిసెంబర్ 16 నుంచి పార్టీ పేరును మార్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇటీవల అధికారికంగా సమాచారం వచ్చిన వెంటనే బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తమ కార్యక్రమాలను వేగవంతం చేశారు.
ఈ నెలాఖరుకల్లా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిస్సా, సహా ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లో బిఆర్ఎస్ కిసాన్ సెల్ లను ప్రారంభించాలని కెసిఆర్ నిర్ణయించారు. ఈ మేరకు కసరత్తులు పూర్తి చేసుకుని క్రిస్మస్ పండగ అనంతరం ఆయా రాష్ట్రాల్లో కార్యకలాపాలను వేగవంతం చేయాలని నిర్ణయించారు.