తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ త్వరలో యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ పాదయాత్ర కోసం టీడీపీ పోలీసుల అనుమతిని కోరింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP)కి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య లేఖ రాశారు. జనవరి 27వ తేదీన ప్రారంభమయ్యే తమ పార్టీ నాయకుడికి 400 రోజుల పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని అందులో కోరారు. ఈ పాదయాత్ర కుప్పం నుండి ఇచ్చాపురం వరకు 4000 కిలో మీటర్ల మేర కొనసాగనుంది. లోకేష్ తన పాదయాత్రలో యువత సమస్యలు, నిరుద్యోగం, రైతు సమస్యలు, మహిళా సమస్యలు, పెన్షన్లు తదితర అంశాల్లో ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపుతారు.
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, లా అండ్ ఆర్డర్ పాటిస్తూ పాదయాత్ర సాగుతుందని, ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు, ట్రాఫిక్ సమస్య ఉండదని ఆ లేఖలో పేర్కొన్నారు. లోకేష్ మాజీ ముఖ్యమంత్రి తనయుడు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఆయనకు ఎక్స్ట్రీమిస్ట్, ఫ్యాక్షనిస్ట్‌లు, పొలిటికల్ రైవల్స్‌తో ప్రాణభయం ఉంటుంది, కాబట్టి అవసరమైన సెక్యూరిటీని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. లోకేష్‌కు సరైన సెక్యూరిటీ చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా పాదయాత్ర ఆగిన తర్వాత రాత్రి సమయంలో బస చేసేచోట అవసరమన్నారు.
ఇటీవల చంద్రబాబు గుంటూరు, కందుకూరు సభలలో పదకొండు మంది సామాన్యులు మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లోకేష్ పాదయాత్రకు ఇబ్బందులు కలిగించవచ్చుననే ప్రశ్నలు తలెత్తాయి. కానీ ఇప్పటికే జీవో నెంబర్ 1 ద్వారా ప్రతిపక్షాలను ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నాలు చేస్తోందనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో లోకేష్ యాత్రకు అడ్డు చెప్పే అవకాశాలు లేవని అంటున్నారు. జీవో నెంబర్ 1 ప్రకారం హైవేలు, పంచాయతీలు, మున్సిపల్ రోడ్ల పైన మాత్రమే సభలు నిర్వహించాలి.