తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో 50 ఏళ్ల మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చిన సంఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం వరత్తూరు పంచాయతీకి చెందిన కన్నారెడ్డి సిద్ధమ్మ దంపతులకు చాలా కాలం వరకు పిల్లలు లేరు. చాలా సంవత్సరాలుగా విఫల ప్రయత్నాలు చేసి విసిగిపోయిన ఈ దంపతులు చెన్నై సంతానోత్పత్తి కేంద్రాన్ని సంప్రదించారు. ఈ క్రమంలో ఐవీఎఫ్ పద్ధతిలో సిద్ధమ్మ గర్భం దాల్చింది. చెన్నైలోనే చికిత్స పొందేందుకు ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో 8వ నెలలో వారు తిరుపతి ప్రసూతి ఆస్పత్రిని సంప్రదించారు. అధిక రక్తపోటుతో పాటు రక్తహీనత సమస్యతో బాధ పడుతున్న సిద్ధమ్మ గర్భంలో కవలలున్నట్టు వైద్యులు గుర్తించారు.
జూన్ 2వ తేదీన సిద్ధమ్మను ఆస్పత్రిలో చేర్చుకుని వైద్యసేవలు అందించారు. గత నెల 23న వైద్యులు సునీత, సంధ్య సిజేరియన్ ఆపరేషన్ చేశారు. సిద్దమ్మకు ఇద్దరు మగపిల్లలు పుట్టారని, ఇద్దరూ 2.1 కిలోల చొప్పున సంపూర్ణ అరోగ్యంగా ఉన్నారని వెల్లడించారు. తల్లిబిడ్డల ఆరోగ్యం మెరుగుపడడంతో మంగళవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. 50 సంవత్సరాల వయసులో పిల్లలు కావాలనే వారి కోరిక తీరడంతో వారి బంధువులు ఆనందంగా ఉన్నట్లు తెలుస్తుంది.