చంద్రబాబు పర్యటన నేపథ్యంలో… ఆయన సొంత నియోజకవర్గమైన కుప్పంలో హై టెన్షన్ నెలకొంది. ఇటీవల ఆయన రెండు రోడ్ షోలలో దాదాపు 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో…రోడ్ షోలు, బహిరంగ సభలను రద్దు చేశారు. ఈ క్రమంలోనే అనుమతి లేకున్నా… ఆయన కుప్పం పర్యటనకు వెళ్తుండటంతో… ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.
శాంతిపురం (మ) పెనుమాకులపల్లిలో చంద్రబాబు సభకు అనుమతి లేదన్న పోలీసులపై టీడీపీ నేతలు వాదులాటకు దిగారు. టిడిపి నేత, మాజీ ఎమ్మెల్సీ గౌరీవాణి శ్రీనివాసులు పోలీసులపై దౌర్జన్యం చేయడంతో వెంటనే పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.
ఏపీ-కర్ణాటక బార్డర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై పోలీసులు స్పందిస్తూ టీడీపీ నేతలు అనుమతి కోరితే తప్పకుండా పరిశీలించి అనుమతిస్తామన్నారు. కొత్త నిబంధల ప్రకారమే ఎవరికైనా అనుమతులు ఉంటాయని తెలిపారు. వాస్తవాలను కప్పి పుచ్చి టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు. కాగా రహదారులపై సమావేశాలతో ప్రాణ నష్టం జరుగుతుండటంతో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే.