ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది. ముఖ్య నేతలు మాత్రం పాదయాత్ర బాట పట్టారు. బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తామని అంటోంది. ఇటు టీడీపీతో కూడా జనసేన సఖ్యంగానే ఉంటుంది. దీంతో ఏ ఏ పార్టీ కలిసి పోటీ చేస్తుందనే అంశంపై స్పష్టత లేదు. ఇదే విషయంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. జనసేనతో కలిసి పోటీ చేస్తామని అంటున్నారు. టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని మరోసారి తేల్చిచెప్పారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పర్యటనలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు.
పవన్ చూపు..
జనసేనతో కలిసి పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇటీవల హైదరాబాద్‌లో చంద్రబాబును పవన్ కల్యాణ్ కలిశారు. ఆ తర్వాత పొత్తు ఖరారు అయినట్టు వార్తలు వచ్చాయి. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ బహిరంగంగానే జనసేనతో కలిసి పోటీ చేస్తామని చెబుతున్నారు. వారాహి ఆగదు, యువగళం ఆగదు అని చెబుతున్నారు. కానీ సోము వీర్రాజు మాత్రం తమ పొత్తు జనసేనతో ఉంటుందని స్పష్టంచేశారు. టీడీపీతో కలిసేది లేదని చెబుతున్నారు.
పొత్తులేనా?
2014 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ టీడీపీకి సపోర్ట్ చేశారు.. అందుకే ఆ పార్టీ విజయం సాధించింది. 2019లో మాత్రం ఒంటరిగా పోటీ చేసినా.. జగన్ ధాటికి నిలబడలేకపోయారు. పవన్ కల్యాణే పోటీ చేసినా రెండు చోట్ల ఓడిపోయారు. కాపు ఓట్లను కూడా మళ్లించలేకపోయారు. ఈ సారి పవన్ కల్యాణ్ సపోర్ట్‌తో మరోసారి అధికారం చేపట్టాలని బాబు అనుకుంటున్నారు. తమతో కలిసి పవన్ అడుగులు వేస్తారని సోము వీర్రాజు ధీమాతో ఉన్నారు.
చంద్రబాబే?
ప్రత్యేక హోదా ముగిసిన అద్యాయం కాదని సోము వీర్రాజు అన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి అప్పటి సీఎం చంద్రబాబు ఒప్పుకున్నారని గుర్తుచేశారు. అందుకే 15 వేల కోట్లు ఇచ్చామని.. ఇంకొన్ని నిధులు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ప్రత్యేక హోదాపై రాజ్యసభ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజన అన్యాయంగా జరిగిందని వివరించారు. పార్లమెంట్ తలుపులు మూసి బిల్లు పాస్ చేశారని తెలిపారు. ప్రత్యేక హోదా ఇస్తామనే వాగ్దానాన్ని బీజేపీ మరచిపోయిందని విమర్శించారు.