ఏనుగుల సంచారంతో చిత్తూరు జిల్లాలోని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. తాజాగా పొలం దగ్గర ఉన్న ఇద్దరు దంపతులపై ఏనుగు దాడి చేయగా..వారు అక్కడికక్కడే మృత్యువాత చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఏపీలోని చిత్తూరు జిల్లా గుడిపాడ మండలం రామాపురంలో ఈరోజు(ఆగస్టు 30న) విషాదం చోటుచేసుకుంది. ఒంటరి ఏనుగు దాడి చేసిన క్రమంలో దంపతులు మృత్యువాత చెందారు. సెల్వీ, ఆమె భర్త వెంకటేష్ పొలం వద్ద ఉండగా..అక్కడికి ఆకస్మాత్తుగా వచ్చిన గజరాజు వారిపై ఎటాక్ చేసింది. ఆ తర్వాత స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఆ క్రమంలో దానిని అడవిలోకి పంపించే ప్రయత్నం చేశారు. ఈ విషయం తెలిసిన స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
ఇప్పుడే కాదు గతంలో కూడా ఏపీలో పలుమార్లు ఏనుగులు దాడి చేసిన ఘటనలు సంభవించాయి. 2023 మే 12న కుప్పులో ఏనుగుల దాడిలో ఇద్దరు మరణించారు. 2011 జనవరి 13న చిత్తూరు జిల్లాలోకి ఏనుగుల గుంపు ప్రవేశించి అటవీ అధికారిపై దాడి చేయగా..అతను మృత్యువాత చెందాడు. ఆ తర్వాత 2011 మే 6న కూడా విజయనగరం జిల్లా పాతకలికోటలో గజరాజు దాడిలో మహిళా రైతు మరణించింది.