ఏపీ సీఎం జగన్‌పై మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో గత రెండేళ్ల నుంచి ఏం చేశారని అడిగారు. కాలయాపనకు కారణాలెంటో వివరించాలని డిమాండ్ చేశారు. ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఆయన మీడియాకు చూపించారు. రివర్స్ టెండరింగ్‌తో పోలవరానికి రివర్స్ గేర్ పడిందని విమర్శలు చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రాజకీయాలకు అతీతంగా ఇతర అంశం ముడిపడి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. లేదంటే ఇన్నిరోజులు గడిచేది కాదని సందేహాం వ్యక్తం చేశారు.ప్రాజెక్టుపై ఆర్థికశాఖ అభ్యంతరం తెలిపి రెండేళ్లు అవుతున్నా జగన్ సర్కార్ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఫైరయ్యారు. ఇందులో ఏదో మతలబు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. డీపీఆర్-2 పనులు ప్రారంభం కాలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి చెందిన 31 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. గత 43 నెలలుగా సీఎం జగన్ ఏం చేస్తున్నారని.. ఢిల్లీ వెళ్లి రావడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ప్రభుత్వానికి ఖర్చులు తప్ప సాధించింది ఏమీ లేదని దేవినేని ఉమ విరుచుకుపడ్డారు.
గొల్లపూడి వన్ సెంటర్లో భోగి మంటలు, సంక్రాంతి వేడుకల్లో దేవినేని ఉమ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఈ మేరకు టీడీపీ నేతలతో కలిసి జీవో నెంబర్ 1 ప్రతులను భోగి మంటల్లో వేశారు. ఏపీ సర్కార్ ఇటీవల జోవో నంబర్ 1 తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలపై నిషేధం విధించింది. ఇటీవల చంద్రబాబు పాల్గొన్న రెండు సభల్లో 11 మంది చనిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాలు మాత్రం నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర, పవన్ కల్యాణ్ వారాహి వాహనంలో యాత్ర చేపడుతున్నారని, వారిని ఆపేందుకు జీవో తీసుకొచ్చారని విమర్శిస్తోంది. ప్రభుత్వం మాత్రం అదేం కాదని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.