Women success: భర్త ప్రోత్సాహంతో కూలి పని చేస్తూనే పీహెచ్డీ చేసిన మహిళ!
పట్టుదల ఉంటే సాధించనిది అంటూ ఏదీ ఉండదు. అన్ని సదుపాయాలు ఉన్నా కొందరు కాలాన్ని వృథా చేస్తుంటారు. ఇక్కడొక మహిళ మాత్రం రెక్కాడితే డొక్కాడని పరిస్థితిలో కూడా చదువుపై శ్రద్ధ పెట్టింది. రాత్రీపగలూ కష్టపడి కెమిస్ట్రీలో పీహెచ్డీ సాధించింది.
భర్త సహకారంతో చదివి ఓ మహిళ పీహెచ్డీ చేసింది. అనంతపురం జిల్లా శింగనమల మండలం నాగులగుడ్డం గ్రామంలో సాకే భారతి నివశిస్తోంది. ఆమె ఎలాంటి కోచింగ్‌లు, క్లాసులు లేకుండానే పీహెచ్డీ పట్టా సాధించింది. రోజూ కూలి పనులకు వెళ్తూనే ఖాళీ సమయంలో చదువుకుంటూ ఈ ఘనత సాధించింది. చిన్నపటి నుంచి భారతికి చదువు అంటే చాలా ఇష్టం. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటర్‌తో చదువును ఆపేసింది. తన మేనమామ శివప్రసాద్ ను పెళ్లాడిన భారతి..ఆ తర్వాత ఆయన ప్రోత్సాహంతో అనంతపురం ఎస్ఎస్బీఎన్లో డిగ్రీ, పీజీ చదివింది.
భారతికి ఓ పాప పుట్టినా కూడా చిన్నారి ఆలనాపాలనా చూస్తూ కాలేజీకి వెళ్లేది. బస్సు సౌకర్యం లేకపోవడంతో 8 కిలోమీటర్లు నడిచి ఆ తర్వాత బస్సు ద్వారా 28 కిలోమీటర్లు ప్రయాణించి కాలేజీకి వెళ్లేది. ఆమె శ్రమ, పట్టుదల చూసిన టీచర్లు ఆమెను పీహెచ్డీ చేయమని సూచించారు.
దీంతో భర్త ప్రోత్సాహంతో ఆమె పీహెచ్డీ చేయడానికి నిర్ణయించుకుంది. భారతికి ప్రొఫెసర్ డాక్టర్ ఎంసీఎస్ శుభ దగ్గర బైనరీ మిక్చర్స్ అంశంపై రీసెర్చ్ చేసే అవకాశం కూడా లభించింది. కష్టపడి చదివి శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో భర్త, బిడ్డతో కలిసి భారతి పీహెచ్డీ పట్టాను అందుకుంది. ఎందరో మహిళలకు ఆమె ఆదర్శమైంది.