తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. శుక్రవారం శ్రీవారిని 57,147 మంది దర్శించుకున్నారు. అలాగే 26,094 మంది తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.78 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
ఇకపోతే రేపు రామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లు వేడుకగా సాగుతున్నాయి. ఇప్పటికే ఈ ఏర్పాట్లపై తిరుమల వీజీవో బాలిరెడ్డి, తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య ఆధ్వర్యంలో అధికారులు సమావేశమై పలు విషయాలు చర్చించారు. పాపవినాశనం వద్ద పార్కింగ్ సమస్య దృష్ట్యా భక్తుల రద్దీకి సరిపడా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తిరుమల ఆర్టీసీ డిపో మేనేజర్ వెల్లడించారు. గతంలో మాదిరిగానే ప్రైవేటు టాక్సీ డ్రైవర్లు, భక్తులు టీటీడీకి సహకరించాలని అధికారులు కోరారు. రామకృష్ణ తీర్థానికి వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. అలాగే భక్తులకు ఆహారం, తాగునీటి సౌకర్యం, వైద్య సదుపాయం ఏర్పాటు చేస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు.