కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రలో భాగంగా వెల్లడించారు. ఈ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని ఆయన అన్నారు. ఇప్పటికే తమిళనాడు, కేరళ, కర్ణాటక విజయవంతంగా పాదయాత్ర కొనసాగినట్లు చెప్పారు.
ఈ పాదయాత్ర అక్టోబర్ 18న ఏపీలోకి ప్రవేశించనుంది. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో మొదలై, ఆలూరు నియోజకవర్గం నుంచి మంత్రాలయం వరకు కొనసాగనుంది. 4 రోజులపాటు ఏపీలో 95 కిలోమీటర్ల మేరకు రాహుల్ పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. దీంతోపాటు దిగ్విజయ్ సింగ్ కూడా 2024లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి స్పెషల్ స్టేటస్ హోదా ఇస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామనడంతో ఏపీ రాజకీయ నేతల్లో ప్రస్తుతం స్పెషల్ స్టేటస్ హాట్ టాపిక్‌గా మారింది.
మరోవైపు తెలంగాణలో రాహుల్ గాంధీ 13 రోజులపాటు పాదయాత్ర చేయనున్నట్లు జైరాం రమేష్ ప్రకటించారు. తెలంగాణలో మునుగోడు ఉపఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరడంతో ఈ ఉపఎన్నిక నవంబర్ 3న జరగనుంది.