మొన్నటిదాకా తెలంగాణ కే పరిమితమైన తమ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీగా చేసిన సంగతి తెలిసిందే. పార్టీని జాతీయ పార్టీగా మార్చేసిన తర్వాత…. అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేసేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే… ముందుగా ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే పార్టీ కార్యక్రమాలు ప్రారంభించేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల నుంచి వివిధ కార్యక్రమాలకు పార్టీ రూపకల్పన చేస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు, దీని కోసం ఓ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రారంభించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆయన ఆధ్వర్యంలో పనుల పర్యవేక్షణ ఉంటుందని, జనవరి చివరలో కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం కానుందని వెల్లడించాయి. అమరావతిలో పార్టీ భనవ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన బీఆర్ఎస్.. తాత్కాలిక కార్యాలయం నుంచే పార్టీ కార్యక్రమాలు ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నెల 26 లేదా 27న ఏపీకి చెందిన కొందరు నేతలు కేసీఆర్ ను కలిసే అవకాశం ఉంది.