»Cm Jagans Key Announcement Soon Jobs For 6 Lakh People
Andhrapradesh: సీఎం జగన్ కీలక ప్రకటన..త్వరలో 6 లక్షల మందికి ఉద్యోగాలు
త్వరలో ఏపీలో 6 లక్షల మందికి ఉద్యోగాలు లభించనున్నాయని, 94 ప్రాజెక్టులు ప్రారంభం కానున్నాయని సీఎం జగన్ తెలిపారు. నేడు వర్చువల్గా ఆయన పలు పరిశ్రమలను ప్రారంభించారు. ఇప్పటి వరకూ ఏపీలో 86 వేల మందికి ఉపాధి లభించినట్లుగా వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సీఎం జగన్ (Cm Jagan) అన్నారు. త్వరలో 6 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే దిశగా ప్రణాళిక వేస్తున్నట్లు తెలిపారు. నేడు సీఎం జగన్ పలు పరిశ్రమలను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పారిశ్రామిక రంగంపై ఫుల్ ఫోకస్ చేసినట్లు తెలిపారు. కలెక్టర్లు కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహాయ సహకరాలు అందించాలని కోరారు.
గ్లోబల్ ఇన్వెస్టర్స్ (Global Investors) సమ్మిట్లో 386 సంస్థలతో ఒప్పందం చేసుకున్నామని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. సుమారు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికలు వేశామని, ఈ పెట్టుబడుల ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగాలు అందుతాయని సీఎం జగన్ వివరించారు.
ప్రతి నెలా సమీక్ష ద్వారా చర్యలు చేపడుతున్నామని, 33 యూనిట్లు ఏర్పాటై ఇప్పటికే తమ ఉత్పత్తులను ప్రారంభించినట్లు గుర్తు చేశారు. మరో 94 ప్రాజెక్టుల పనులు శరవేగంగా సాగుతున్నట్లు తెలిపారు. ఇంకొన్ని పరిశ్రమలు ప్రారంభ దశలో ఉన్నాయన్నారు. నాలుగున్నర ఏళ్లల్లో 130 భారీ, అతి భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసినట్లుగా సీఎం జగన్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 69 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 86 వేల మంది ఉద్యోగాలు పొందారని సీఎం జగన్ స్పష్టం చేశారు.