CM Jagan: ఏపీ సీఎం జగన్‌పై (CM Jagan) టీడీపీ డిప్యూటీ ప్లోర్ లీడర్ నిమ్మల రామా నాయుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2004లో ఇల్లు అమ్ముకునే స్థితిలో ఉన్న జగన్ ఫ్యామిలీ తర్వాత రూ.3.30 లక్షల కోట్లకు ఎలా ఎదిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ అధికారంలోకి రావడంతో జగన్ ఆస్తులు భారీగా పెరిగాయని వివరించారు. ప్రజా సంపదను దోచుకున్న జగన్ ఆర్థిక ఉగ్రవాది అని మండిపడ్డారు. జగన్‌పై ఉన్న కేసులు, పిటిషన్లు, స్టేల గురించి అమరావతి టీడీపీ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.
సాక్షి మీడియా గ్రూప్‌ను 2006లో రూ.8 లక్షలతో ప్రారంభించారని నిమ్మల రామానాయుడు గుర్తుచేశారు. రూ.10 షేర్‌ను రూ.360కి విక్రయించారని వివరించారు. సెజ్, గనులు, భూములు, కాంట్రాక్టులు కేటాయించి, ప్రతిఫలంగా జగతి పబ్లికేషన్‌లో పెట్టుబడులు తరలించారని తెలిపారు. 2006లోనే ఎలాంటి పెట్టుబడి లేకుండా భారతీ సిమెంట్స్‌లోకి జగన్ ఎండీగా, చైర్మన్‌గా ఎంపిక అయ్యారని గుర్తుచేశారు. గాలి జనార్థన్ రెడ్డితో జగన్ భారీ దోపిడీకి పాల్పడ్డారని వివరించారు.
లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూ కేటాయింపులకు ప్రభుత్వంతో ఒప్పందం కుదిరిన తర్వాత జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్, ఇందు సంస్థల్లోకి రూ.70 కోట్ల పెట్టుబడులు వచ్చాయని వివరించారు. జగన్, భారత్, విజయలక్ష్మీ డైరెక్టర్లుగా ఉన్న సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌కు గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో 1500 ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నారని వివరించారు. రైతులను బెదిరించి మరీ భూములను తీసుకున్నారని పేర్కొన్నారు. 2019లో జగన్ ఫ్యామిలీ ల్యాండ్, లిక్కర్, మైన్, పోర్ట్స్ కుంభకోణాల ద్వారా రెండున్నర లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిందని సంచలన ఆరోపణలు చేశారు. ఇసుకు ద్వారా రూ.40 వేల కోట్ల వసూల్ చేశారని ఆరోపించారు.
మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్‌కు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని అడిగారు. ప్రభుత్వ ఖజానాకు వెళ్లాల్సిన రూ.41 వేల కోట్ల ఆదాయం తాడేపల్లి ప్యాలెస్‌కు మళ్లించారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. మద్యం ధరలను పెంచి డిస్టిలరీల నుంచి కమీషన్లుగా మరో రూ.13,500 కోట్లు కొట్టేశారని తెలిపారు.