Chandrababu : చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న కేసరపల్లి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు వేదికైన కేసరపల్లి సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Chandrababu to take Oath as CM : ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు(CBN) నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం కృష్ణా జిల్లాలోని విజయవాడ, గన్నవరం మధ్యలో ఉన్న కేసరపల్లి ఇందుకు సిద్ధమవుతోంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. బుధవారం ఉదయం 11.27 నిమిషాలకు ఈ వేడుక జరగనుంది. ఈ నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం ఐదు ప్రాంతాల్లో 65 ఎకరాల్లో పార్కింగ్ని ఏర్పాటు చేశారు.
చంద్రబాబు(CHANDRABABU) ప్రమాణ స్వీకారం నేపథ్యంలో వచ్చే అతిథుల కోసం విజయవాడ చుట్టు పక్కల ఉన్న అన్ని హోటళ్లు బుక్ అయిపోయినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ వేడుకకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు అంతా పెద్ద ఎత్తున హాజరవుతారని తెలుస్తోంది. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరలో ఉండటంతో ఈ కేసరపల్లిని ప్రమాణ స్వీకారానికి(SWEARING) అనువైన స్థలంగా అధికారులు గుర్తించారు. ప్రధాన వేదిక 14 ఎకరాల విస్తీర్ణంగా సువిశాలంగా ఉంటుంది.
ఈ విశాల ప్రాంగణంలో ఎండ నుంచి రక్షణ కోసం షెడ్లను నిర్మిస్తున్నారు. వేలాది మంది కార్మికులు రాత్రింబగళ్లు కష్టపడి ఈ పనులు చేస్తున్నారు. ఆహ్వానితులకు ఇప్పటికే పాసులను అందజేస్తున్నారు. ప్రధాని మోదీ సహా దేశ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉండటంతో 50 మందికి సరిపోయేలా ప్రధాన వేదికను తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి జగన్ ప్రభుత్వంలో బాధిత కుటుంబాలను సైతం ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు.