తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై దృష్టి సారించారు. 2018 ఎన్నికల అనంతరం టీడీపీ మొదటిసారి తెలంగాణలో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాలు సమైక్య రాష్ట్రంగా ఉండాలన్నదే తమ ఉద్దేశ్యమని వైసీపీ సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు. తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలిసే అవకాశం లేదని బుద్దిలేని వాళ్లు అలా మాట్లాడుతుంటారని ధ్వజమెత్తారు. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ, దేశంలో మొదటి రెండు స్థానాల్లో ఉండాలని తాను కోరుకుంటున్నాన్నారు. ఖమ్మం నుండి టీడీపీకి పూర్వ వైభవం వస్తుందన్నారు.
చంద్రబాబు లేదా తెలంగాణ తెలుగుదేశం పార్టీ వ్యూహత్మకంగానే ఖమ్మం జిల్లా ద్వారా తెలంగాణలోకి ఒకవిధంగా రీఎంట్రీ ఇచ్చిందని చెప్పవచ్చు. ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్ వంటి జిల్లాల్లో ఏపీవాసులు ఎక్కువ. ఖమ్మంలో కమ్మ సామాజిక వర్గం అధికం. 2018 ఎన్నికల్లోను రెండు సీట్లు గెలుచుకుంది. తర్వాత వారు పార్టీ మారడం వేరే విషయం. ఇన్ని సానుకూలతల నేపథ్యంలో ఇక్కడ సభ ద్వారా తమ సత్తా చాటాలనుకున్నారు. సభ కూడా భారీగానే సక్సెస్ అయింది. చంద్రబాబుకు హైదరాబాద్ నుండి ఖమ్మం వరకు పలుచోట్ల ఘన స్వాగతం లభించింది. సభకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… తెలంగాణలో టీడీపీ లేదనే వారికి ఈ సభ సమాధానం అన్నారు. చాలా రోజుల తర్వాత ఖమ్మం వచ్చినప్పటికీ, ప్రజల ఆదరణ మరిచిపోలేనన్నారు. తెలంగాణలో ఇతర పార్టీల కంటే ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకే ఎక్కువగా ఉందన్నారు. ఈ సందర్భంగా పార్టీని వీడిన వారికి కూడా బాబు మళ్లీ ఆహ్వానం పంపారు. తెలంగాణలో టీడీపీని వీడి వెళ్లిపోయిన వారు తిరిగి పార్టీలో చేరాలని కోరారు. టీడీపీ పుట్టిందే తెలంగాణ గడ్డ పైన అన్నారు.