Chandrababu: జగన్‌కి ఓటేయడంతో రాజధాని లేకుండా చేశారు గత ఎన్నికల్లో జగన్‌కి ఓటేస్తే ఏపీకి రాజధాని లేకుండా చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వెయ్యి మంది జగన్‌లు వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరన్నారు. అమరావతి రైతులు, మహిళల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అమరావతి కోసం 29వేల మంది రైతులు 35 వేల ఎకరాలు ఇచ్చారు. రాజధానికి కేంద్రం కూడా సహకరించింది. అమరావతిని కూడా హైదరాబాద్‌లా మార్చుదామని ప్రణాళికలు వేశాం. విజయవాడ, గుంటూరుతో కలిపి ఆదర్శ రాజధాని చేయాలనుకున్నాం. ప్రపంచ దేశాలన్నీ అమరావతి వైపు చూడాలని ఆలోచించా.
సంపద సృష్టించే కేంద్రంగా తయారు చేయాలనుకున్నా. జగన్ వచ్చిన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చేశారు. ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. రాజధాని అంటే పెద్ద పెద్ద భవనాలు కాదు. ఆంధ్రుల ఆత్మగౌరవం. ఆత్మ విశ్వాసం. అమరావతిలో మూడు ముక్కలాట ఆడుతూ తమాషాలు చేస్తున్నారు. అమరావతిని ఎవరూ కూడా ఇక్కడి నుంచి కదల్చలేరు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే తెలుగుదేశం పార్టీ సత్తా. మన రాజధాని అమరావతే. విశాఖపట్నం, కర్నూలును అభివృద్ధి చేస్తాం. గోదావరి జిల్లాల్లో వైసీపీకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు అమరావతి ప్రజల సంబరాలతో పాటు జగనాసుర వధ కూడా జరగుతుందని చంద్రబాబు అన్నారు.