»Boy Kidnap Two Year Old Boy Kidnapped In Tirupati Bus Stand
Boy Kidnap : తిరుపతి బస్టాండ్ లో రెండేళ్ల బాలుడు కిడ్నాప్..ఏర్పేడులో సురక్షితం
తిరుపతి బస్టాండ్‌లో బాలుడు కిడ్నాప్‌కు గురయ్యాడు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అయితే బాలుడిని ఏర్పేడులో ఓ మహిళ పోలీసులకు అప్పగించింది. దీంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.
తిరుపతి బస్టాండ్‌లో రెండేళ్ల బాలుడు కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. తెల్లవారుజామున 2 గంటలకు బాలుడు అరుణ్ మురుగన్‌ను గుర్తు తెలియని వ్యక్తి తీసుకెళ్లినట్లు పోలీసులు సీసీఫుటేజ్ ద్వారా తెలుసుకున్నారు. తమిళనాడు రాజధాని చెన్నై నుంచి అరుణ్ మురుగన్ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమైంది.
శ్రీవారి దర్శనం ముగిసిన తర్వాత తిరుపతి బస్టాండ్‌కు రాత్రి 12 గంటలకు చేరుకుంది. అర్థరాత్రి కావడంతో బస్టాండ్ లోనే బాలుడి కుటుంబం నిద్రపోయింది. అయితే తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో ఆ బాలుడు కనిపించలేదు. బస్టాండ్ మొత్తం వెతకగా ఎక్కడా కనపడలేదు. దీంతో బాలుడి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గుర్తుతెలియని వ్యక్తులు బాలుడిని కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అయితే బాలుడి కిడ్నాప్ వెనుక ఓ మహిళతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ప్రత్యేక పోలీస్ బృందాలు బాలుడు ఆచూకీ గుర్తించే పనిలో పడ్డాయని సీఐ మహేశ్వర్ రెడ్డి తెలిపారు.
తప్పిపోయిన బాలుడు ఏర్పేడులో సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఓ మహిళ బాలుడిని అప్పగించినట్లుగా ఏర్పేడు పోలీసులు తెలిపారు. రాత్రి 2 గంటల ప్రాంతంలో తప్పిపోయిన బాలుడు ఏర్పేడులో పోలీసుల చెంతకు చేరాడు. దీనిపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపడుతున్నారు. బాబును ఎత్తుకెళ్లిన గుర్తుతెలియని వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.