Pawan Kalyan : పవన్ ఢిల్లీ పర్యటనపై బీజేపీ నేతల రియాక్షన్ ఇదే..!
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తమ పార్టీ నేత నాదేండ్ల మనోహర్ తో కలిసి ఆయన ఢిల్లీలో పలువురు బీజేపీ నేతలతో సమావేశమౌతున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంపై క్లారిటీ కోసం ఆయన సమావేశం అవుతున్నట్లు తెలుస్తోంది.
ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ మురళీధరన్ తో పవన్ భేటీ అయ్యారు. పలు విషయాలపై చర్చించారు. హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కూడా కలవడానికి పవన్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒక్క ఓటు కూడా చీలకుండా చూస్తామని పవన్ కళ్యాణ్ గతంలో చెప్పారు. టీడీపీ, బీజేపీలతో కలిసి జనసేన ఎన్నికల బరిలో దిగాలని భావిస్తోంది. టీడీపీతో పొత్తు వద్దనే అభిప్రాయంతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇటువంటి నేపథ్యంలో పవన్ ఢిల్లీ పర్యటన విజయవంతం అవుతుందా లేదా అనే విషయం ఆసక్తిగా మారింది.
పవన్ కల్యాణ్ ను ఢిల్లీకి రమ్మనమని ఎవరూ పిలవలేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. పవన్ కల్యాణ్ స్వయంగా చొరవ తీసుకుని పొత్తు ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇదిలా ఉండగా…. పవన్ కళ్యాణ్ సూచిస్తున్నట్లు టీడీపీతో పొత్తుకు మాత్రం బీజేపీ విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీతో స్నేహం పట్ల మొదటి నుంచి బీజేపీ అపనమ్మకంతో ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో మాత్రమే కలిసి పనిచేసేందుకు బీజేపీ సముఖంగా ఉంది.
పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన విషయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తనదైన శైలిలో స్పందించారు. పవన్ ఢిల్లీ పర్యటన గురించి తనకు ఎటువంటి సమాచారం లేదని తెలిపారు.