మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఊరట లభించింది. తన ఇంటి నిర్మాణంలో కబ్జాకి పాల్పడ్డారంటూ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి(Ayyanna Patrudu)పై గతంలో కేసు నమోదయ్యింది. ఈ కేసుకి సంబంధించి అయ్యన్న పాత్రుడు ఫోర్జరీ డాక్యుమెంట్లను కోర్టు ముందుంచారంటూ ఏపీ సీఐడీ తాజాగా ఆయన్ని నిన్న అర్థరాత్రి అరెస్టు చేసిన విషయం విదితమే.
అరెస్టు చేసిన దగ్గర్నుంచి, తీవ్ర గందరగోళమే కనిపించింది ఈ కేసులో. ఏలూరు తీసుకెళతామని పోలీసులు, అయ్యన్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కానీ, అందుకు విరుద్ధంగా విశాఖ తరలించారు అయ్యన్నపాత్రుడిని.
వైద్య పరీక్షల అనంతరం అయ్యన్న పాత్రుడిని కోర్టులో ఏపీ సీఐడీ హాజరు పర్చగా, న్యాయస్థానం సంబంధిత సెక్షన్లు ఈ కేసులో చెల్లవని తేల్చినట్లు తెలుస్తోంది. ఏపీ సీఐడీ సమర్పించిన రిమాండ్ రిపోర్టుని న్యాయస్థానం తిరస్కరించడంతో అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడికి ఊరట లభించినట్లయ్యింది.
అయ్యన్న పాత్రుడిపై అభియోగాలు తప్పని తేలాయంటూ టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అయితే, నోటీసు ఇచ్చి అయ్యన్న పాత్రుడిని ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగించవచ్చునని ఏపీ సీఐడీకి సూచించింది న్యాయస్థానం.