»Ap Rains Next Three Days Upto September 17th 2023
AP rains: ఏపీలో మూడు రోజులు వర్షాలు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్రంలో నేటితోపాటు వచ్చే మూడు రోజులు వర్షాలు(rains) కురియనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది.
తూర్పు మధ్య బంగాళాఖాతం పరిధిలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) నేటితోపాటు వచ్చే మూడు రోజులు వర్షాలు(rains) కురియనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇది దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. ఈ రుతుపవన ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్‌పై వర్షాలు తీవ్రంగా ప్రభావం చూపనున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఉత్తర కోస్తాలో అనేక ప్రాంతాలు, దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు చోట్ల వానలు పడతాయని అధికారులు వెల్లడించారు. దీంతోపాటు ఉత్తరకోస్తాలో అక్కడక్కడా ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది.
అంతేకాదు ఈరోజు అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, పార్వతీపురం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) అధికారులు ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే ఏపీలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని అమరావతి, విజయవాడ, మంగళగిరి, గుడివాడ, మాచర్ల తదితర ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి. మరోవైపు విజయవాడ నగరంలో కూడా భారీ వర్షం కురిసింది. వన్ టౌన్, మొగల్రాజపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఇబ్బందులు పడ్డారు.