బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో సెకండ్ సీజన్ మొదలైన సంగతి తెలిసిందే. ఈ షోకి మొదటి గెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ ప్రోమో నందమూరి, నారా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అయితే… రాజకీయంగా ఉపయోగపడాలనే ఇలా ప్లాన్ చేశారని విమర్శించేవారు కూడా ఉన్నారు. కాగా.. తాజాగా.. ఈ విషయంపై మంత్రి రోజా స్పందించారు.
అన్స్టాపబుల్ 2 షోలో అన్స్టాపబుల్ అబద్దాలు చెప్పారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ను పదవీ వ్యామోహంతో వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుని.. ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు … అమాయకంగా ఆ రోజు ‘మీరు కూడా మాతో ఉన్నారు.. నేను కాళ్లు పట్టుకుని ఏడ్చాను.. అయినా ఆయన వినలేదు.. నేను చేసింది తప్పా అని’ అడగడం ప్రజల్ని పిచ్చోళ్లను చేయడమే అన్నారు.
ఎన్టీఆర్ వెన్నుపోటు గురించి అనుకూల మీడియాతో చెబితే ప్రజలు నమ్మడం లేదని.. వేరే వేదికైన షోతో ప్రజల్ని మాయ చేయాలని చూస్తున్నారని విమర్శించారు.ప్రజలు అంత పిచ్చోళ్లు కాదు.. వీళ్లు తింగరోళ్లు కాబట్టి.. వీరు ఇంకా మభ్య పెట్టాలని ప్రజలంతా నవ్వుకుంటున్నారన్నారు. ఒక్క ప్రోమో మీద ఎన్ని వివాదాలు వచ్చాయో చూశామని.. ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అంటూ చంద్రబాబు చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు.
ఆయన్ను పార్టీలో నుంచి సస్పెండ్ చేసి.. చెప్పులు విసిరేసి ఆయన పార్టీని లాక్కుని ఆయన మరణానికి కారణమైన వ్యక్తి ఎన్టీఆర్ ఫోటోలను ఎన్టీఆర్ భవన్ నుంచి బయటకు పడేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ చేసి ఆరాధ్య దైవం అంటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని.. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి కోసం ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుని రోడ్డుపైకి తెచ్చారన్నారు. ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలకు ఎలాంటి అన్యాయం చేశారో చూశామన్నారు.
చంద్రబాబును ఎమ్మెల్యేను చేసి ముఖ్యమంత్రి అవ్వడానికి కారణమైన కుప్పం ప్రజల్ని ఎలా మోసం చేశారో అందరూ గమనించారన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిని పవన్ కళ్యాణ్, చంద్రబాబు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. దశాబ్దాలుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడి ఉన్నాయని.. అందుకే మూడు రాజధానులు అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించడంతో ఈ మూడు రాజధానులు తీసుకొచ్చారని గుర్తు చేశారు. మూడు రాజధానులు వస్తే మంచిదని ప్రజలు భావించారు.. అన్ని ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించారని వ్యాఖ్యానించారు.