స్కిల్ డెవలప్మెంట్ స్కాం(skill development scam) కేసులో మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడును ప్రశ్నించేందుకు ఏసీబీ కోర్టు శుక్రవారం సీఐడీకి రెండు రోజుల కస్టడీని మంజూరు చేసింది. ఈ క్రమంలో చంద్రబాబును నేడు, రేపు సీఐడీ అధికారులు ప్రశ్నించనున్నారు. అయితే అసలు ఎలాంటి ప్రశ్నలు అడగనున్నారు. బాబు ఏం సమాధానం చెబుతారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ap CID will question Chandrababu today and tomorrow
స్కిల్ డెవలప్మెంట్ కేసు(skill development scam)లో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu naidu)ను విచారించేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం సీఐడీకి రెండు రోజుల కస్టడీని మంజూరు చేసింది. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నాయుడుని విచారించాలని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సీఐడీ)ని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీఐడీ పిటిషన్‌పై ఉత్తర్వులను ప్రకటిస్తూ నాయుడు తరఫు న్యాయవాదుల సమక్షంలో నేడు, రేపు ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేపట్టాలని న్యాయమూర్తి ఆదేశించారు. అంతేకాదు ప్రశ్నించిన ఫొటోలు, వీడియోలను బయటపెట్టరాదని కోర్టు ఆదేశించింది.
తెలుగుదేశం పార్టీ (TDP) చీఫ్‌ను ఐదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరగా, కోర్టు రెండు రోజులు మాత్రమే కస్టడీకి అనుమతించింది. అయితే తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని, జ్యుడీషియల్ రిమాండ్‌ను రద్దు చేయాలంటూ నాయుడు వేసిన పిటిషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఏసీబీ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కేసులో చంద్రబాబును సెప్టెంబర్ 9న నంద్యాలలో సీఐడీ అరెస్ట్ చేసింది. మరుసటి రోజు విజయవాడలోని ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మొత్తం అంచనా విలువ రూ.3,300 కోట్లతో ఆంధ్రప్రదేశ్‌లో సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE) క్లస్టర్ల స్థాపనకు సంబంధించిన అక్రమాల కేసులో మాజీ సీఎంను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అవకతవకల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.371 కోట్ల భారీ నష్టం వాటిల్లిందని సీఐడీ పేర్కొంది. సీఐడీ ప్రకారం ప్రభుత్వం అడ్వాన్స్‌గా విడుదల చేసిన డబ్బులో ఎక్కువ భాగం నకిలీ ఇన్వాయిస్ల ద్వారా షెల్ కంపెనీలకు మళ్లించబడిందని, ఇన్వాయిస్లలో పేర్కొన్న వస్తువుల అసలు డెలివరీ లేదా అమ్మకం లేదని సీఐడీ(CID) అధికారులు తెలిపారు.