»Ap Cid Warns Those Who Put Those Posts On Social Media Case Against 2972 People
CID: సోషల్ మీడియాలో ఆ పోస్టులు పెట్టేవారికి ఏపీ సీఐడీ హెచ్చరిక.. 2,972 మందిపై కేసు
సీఎం జగన్, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై చర్యలు తీసుకోనున్నట్లు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ వెల్లడించారు. ఇప్పటి వరకూ 2,972 మందిపై సైబర్ బుల్లీయింగ్ షీట్స్ నమోదు చేశామని, త్వరలో వారి ఆస్తులను అటాచ్ చేస్తామని ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐడీ చీఫ్ సంజయ్ హెచ్చరించారు. అలా పోస్టులు పెట్టేవారి ఆస్తులను అటాచ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే పలు సోషల్ మీడియా అకౌంట్లపై నిఘా ఉంచినట్లు తెలిపారు. తాజాగా ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు.
ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్‌ను గుర్తించామని, త్వరలో నిందితుల ఆస్తులు అటాచ్ చేసే దిశగా చర్యలు చేపడుతామన్నారు. ప్రతిపక్ష నేతలపై సోషల్ మీడియాలో వస్తోన్న పోస్టులపై కూడా చర్యలు ఉంటాయన్నారు. ఆ పోస్టుల్లో ఇప్పటికే కొన్నింటిని తొలగించామన్నారు. న్యాయ వ్యవస్థను కించపరిచేలా పోస్టులు షేర్ చేసిన వారికి శిక్ష తప్పదన్నారు.
సీఎం జగన్, ఆయన కుటుంబీకులపై పోస్టులు పెడుతున్న వారిలో టీడీపీ నేత కార్తీక్ రెడ్డి, సమరసింహారెడ్డి, చిత్రలహరి, వైసీపీ మొగుడు అకౌంట్లను గుర్తించినట్లు ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ ప్రకటించారు. ఇతర దేశాల నుంచి పెట్టే పోస్టుల విషయంలో కూడా ఆయా ఎంబసీలతో మాట్లాడి చర్యలు చేపడుతామన్నారు. ప్రస్తుతం 202 అకౌంట్లపై దృష్టి పెట్టామని, అసభ్య పోస్టులను షేరింగ్, లైక్స్ చేస్తున్న 2,972 మందిపై సైబర్ బుల్లీయింగ్ షీట్స్ తెరిచినట్లుగా సంజయ్ వెల్లడించారు.