Andhra Pradesh: ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు గౌరవ వేతనాన్ని పెంచాలని వేడుకున్న వాలంటీర్లను జగన్ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అమలాపురం పురపాలక సంఘం పరిధిలోని వాలంటీర్లను తొలగించింది. సూర్యనగర్, రామనగర్ ప్రాంతాలకు చెందిన వాలంటీర్లు రెడ్డి సతీశ్‌కుమార్, యనమదల ఉమామహేశ్వరరావు, ఎ.బాబాజన్లను తొలగిస్తున్నట్లుగా పురపాలక సంఘం కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 26 నుంచి పలు జిల్లాల్లో వాలంటీర్లు సమ్మెకు దిగారు.
ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు గౌరవ వేతనాన్ని పెంచాలని అనేకచోట్ల అధికారులను కలిసి వినతి పత్రాలు కూడా ఇచ్చారు. అయితే ప్రభుత్వం కొన్నిచోట్ల బుజ్జగించే ప్రయత్నాలు చేయగా.. మరికొన్ని చోట్ల బెదిరింపులు చేసింది. అయినా వాలంటీర్లు ఇవేం పట్టించుకోకుండా సమ్మెను కొనసాగించారు. దీంతో జగన్ ప్రభుత్వం సమ్మెలో కొనసాగుతున్న వాలంటీర్ల జాబితాను తయారు చేసి దశల వారీగా వేటు వేయాలని నిర్ణయించుకుంది. ఈక్రమంలో వాలంటీర్లను విధుల నుంచి తొలగించింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కార్యకర్తల కంటే వాలంటీర్లు వైసీపీని ప్రచారం చేసినందుకు సీఎం జగన్ ఇచ్చే బహుమతి ఇదేనా? అని వాలంటీర్లు ప్రశ్నిస్తున్నారు.