»Andhra Pradesh Asha Has Warned The Government That Arogyasree Services Will Be Stopped
Andhra Pradesh: ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఆశా
రోగులకు అందించిన చికిత్సలకు తగ్గట్లు ఫీజుల చెల్లింపుల్లో ఆలస్యం, ప్యాకేజీ ధరలను పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 29వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద కొత్త కేసులను చూసేది లేదని అసోసియేషన్ ఏపీ ప్రభుత్వానికి తెలిపింది.
Andhra Pradesh: ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. రోగులకు అందించిన చికిత్సలకు తగ్గట్లు ఫీజుల చెల్లింపుల్లో ఆలస్యం, ప్యాకేజీ ధరలను పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 29వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద కొత్త కేసులను చూసేది లేదని అసోసియేషన్ తెలిపింది. న్యాయపరమైన తమ డిమాండ్లను ఆమోదించే ఉద్దేశం రాష్ట్రప్రభుత్వంలో కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉద్యోగుల ఈహెచ్ఎస్ కింద కూడా వైద్య సేవలు అందించలేమన్నారు.
ఈ ఏడాది జూన్, నవంబర్ నెలల్లో తమ డిమాండ్ల పరిష్కారం కోసం సేవలు నిలిపివేస్తామని ఆశా ప్రకటించింది. దీని తర్వాత ప్రభుత్వం చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈమేరకు రోగులకు యథావిధిగా సేవలు కొనసాగించాయి. కానీ తర్వాత ఇచ్చిన హామీలకు ప్రభుత్వం నుంచి సానుకూల చర్యలు లేకపోవడంతో ఈ నెల 29 నుంచి వైద్యసేవలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.1000 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది. నవంబర్లో జరిగిన చర్చల ప్రకారం డిసెంబర్లోగా పూర్తిస్థాయిలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. కానీ అమలు చేయలేదని అసోసియేషన్ తెలిపింది.
2013 నుంచి చికిత్సల ప్యాకేజీ ధరలు పెంచలేదన్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరిన ఫలితం లేదన్నారు. తాజాగా కుటుంబ వార్షిక చికిత్స పరిమితి ప్రస్తుతం రూ.5 లక్షలు ఉండగా దానిని రూ.25 లక్షలకు పెంచారు. ఈ నిర్ణయం ప్రైవేట్ ఆసుపత్రులపై ఆర్థిక భారాన్ని పెంచింది. ఆయుష్మాన్ భారత్ కింద నిర్ణయించిన ధరలను పరిగణనలోకి తీసుకుని ఇటీవల ప్యాకేజీ ధరలను 10 శాతం తగ్గించారు. 70 శాతం ప్యాకేజీ ధరల్లో మార్పు చేయలేదు. మిగిలిన ప్యాకేజీల ధరల పెంపు కూడా 2.5 శాతం పెరిగింది. వీటివల్ల ఆసుపత్రులకు ఆర్థికంగా జరిగిన ప్రయోజనం శూన్యమని తెలిపింది.