ఆధార్ కార్డు జిరాక్స్‌తో ఓ వ్యక్తి ఘరానా మోసానికి పాల్పడ్డాడు. ఆధార్ జిరాక్స్ ద్వారా ఓ బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా లావాదేవీలు జరిపాడు. అంతేకాకుండా ఆ ఆధార్ కార్డు నంబర్‌ను బ్యాంకు అకౌంట్‌కు లింక్ చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు, వివిధ పథకాల్లోని డబ్బులను దోచుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.
దేశంలోని ప్రతి వ్యక్తి ఆధార్ కార్డు (Aadhar Card) ఎంతో ముఖ్యమైనది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు (Govt Schemes) పొందాలంటే ఈ కార్డు కచ్చితంగా ఉండాల్సిందే. అలాగే అనేక రకాల సేవలను పొందడానికి ఈ గుర్తింపు కార్డు తప్పనిసరి అయ్యింది. సిమ్ కార్డు (Sim Card) తీసుకునే దగ్గరి నుంచి ఇంటికి వంట గ్యాస్ (Gas) తీసుకునే వరకూ అన్నింటికీ ఆధార్ కార్డు జిరాక్స్ (Aadhar Card Xerox) ఇవ్వాల్సిందే. అయితే పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించే ఈమధ్య సైబర్ నేరాలు (Cyber Crimes) భారీగా సాగుతున్నాయి. సైబర్ నేరాలకు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నా ఎక్కడో ఒక చోట ప్రజలు మోసపోతూనే ఉన్నారు.
తాజాగా ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లోని విశాఖ (Visakhapatnam)లో ఘరానా మోసం ఒకటి బయటపడింది. గ్యాస్ కనెక్షన్ (Gas Connection) కోసం ఓ ఇంటి యజమాని తన ఆధార్ కార్డును తీసుకున్నాడు. ఆ నంబర్ ఆధారంగా బ్యాంకు అకౌంట్ తెరిచి ఓ కేటుగాడు లావాదేవీలు (Transactions) సాగించాడు. ఈ ఘరానా మోసం బయటపడటం స్థానికంగా కలకలం రేపింది. కంచరపాలెంలోని సత్తి పద్మావతి తన ఇంటిని గొంప నాయుడు అనే వ్యక్తికి అద్దెకు ఇచ్చింది. కొంత కాలంగా వారు అక్కడ అద్దెకు ఉన్నారు. అయితే 2020లో నాయుడు తన అద్దె ఇంటిని ఖాళీ చేశాడు. తాను వెళ్లేటప్పుడు గ్యాస్ కనెక్షన్ మార్చుకునేందుకు తన ఇంటి యజమాని ఆధార్ కార్డు జిరాక్సు కాపీని తీసుకున్నాడు.
ఆ ఆధార్ కార్డు నంబరుతో గాజువాకలో ఓ బ్యాంకు అకౌంట్ (Bank Account) తెరిచాడు. ఆ అకౌంట్ ద్వారా పలు లావాదేవీలు (Transactions) సాగిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంటి యజమానురాలు పద్మావతికి ప్రభుత్వ పథకాల ద్వారా వచ్చే డబ్బులే కాకుండా, మరికొన్ని రాయితీలు కూడా ఆమె అకౌంట్లో జమ కావట్లేదు. ఇది గమనించిన పద్మావతి అనుమానంతో సచివాలయంలో విచారణ చేసింది. ఆమె ఆధార్ నంబరుకు లింక్ (Aadhar Link) అయి ఉండే గాజువాకలోని బ్యాంకు అకౌంట్‌కు నిధులు వెళ్తున్నట్లు తేలింది.
ఆ విషయం తెలియగానే పద్మావతి అవాక్కయ్యింది. ఆ సమయంలో తాను నాయుడికి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీ ఇచ్చిన విషయం గుర్తుకు వచ్చింది. కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. విశాఖలో ఈ ఘరానా మోసం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఆధార్ కార్డు జిరాక్స్‌లు ఇచ్చేవారు ఈ ఘటనతో ఆందోళన చెందుతున్నారు. మరోవైపు పోలీసులు ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చే సమయంలో పూర్తి వివరాలు తెలుసుకుని ఇవ్వాలని సూచించారు.