AP SSC Results: రేపే పదో తరగతి పరీక్షా ఫలితాలు : మంత్రి బొత్స
ఉపాధ్యాయులతో భేటీ సందర్భంగా పలు విషయాలపై బొత్స సత్యనారాయణ చర్చించారు. విద్యార్థులకు ఒకేసారి కిట్ల పంపిణీ, జూన్ నెలాఖరు వరకే యాప్ లో హాజరు నమోదు, బదిలీల గురించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఏపీలో పదో తరగతి ఫలితాల(AP SSC Results)పై గందరగోళం నెలకొంది. ఏప్రిల్ 3వ తేది నుంచి 18వ తేది వరకూ ఏపీలో పదో తరగతి పరీక్షలు జరిగాయి. అయితే 10వ తరగతి ఫలితాల తేదీలపై జోరుగా ప్రచారం సాగింది. కొందరు మే 5వ తేదిన అని, ఇంకొందరు 7వ తేదిన అని చెబుతున్నారు. దీంతో పదో తరగతి ఫలితాల(AP SSC Results)పై రకరకాల ప్రచారాలు నెలకొన్నాయి. ఈ రోజే ఫలితాలు విడుదల అవుతాయంటూ ప్రచారం జరగడంతో విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు.
దీనిపై డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ డి.దేవానందరెడ్డి రియాక్ట్ అయ్యారు. తప్పుడు ప్రచారాలు చేయొద్దని తెలిపారు. జరుగుతున్న ప్రచారాల్లో నిజం లేదన్నారు. పుకార్లు నమ్మొద్దని తల్లిదండ్రలకు సూచించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa satyanarayana) పదో తరగతి ఫలితాల విడుదల(AP SSC Results) తేదీపై స్పందించారు. మే 6వ తేదిన ఉదయం 11 గంటలకు 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాల నేతలతోనూ ఆయన చర్చలు జరిపారు.
ఉపాధ్యాయులతో భేటీ సందర్భంగా పలు విషయాలపై బొత్స సత్యనారాయణ చర్చించారు. విద్యార్థులకు ఒకేసారి కిట్ల పంపిణీ, జూన్ నెలాఖరు వరకే యాప్ లో హాజరు నమోదు, బదిలీల గురించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవసరమైతే బదిలీ కోడ్ ను తీసుకొస్తామని ఉపాధ్యాయ సంఘాల నేతలకు మంత్రి వెల్లడించారు. అలాగే పాత జీవోలను యథావిధిగా అమలు చేయనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa satyanarayana) హామీ ఇచ్చారు.