వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి వైస్ చైర్మన్ పదవి చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్మన్ల జాబితా నుండి ఆయన పేరును తొలగించారు. తన పేరును ప్రకటించినందుకు తొలుత విజయసాయి రెడ్డి థ్యాంక్స్ కూడా చెప్పారు. కానీ ఆ తర్వాత ఆయన పేరు కనిపించకపోవడం విజయసాయి రెడ్డికి షాక్ అని చెప్పవచ్చు. ఈ నెల 5వ తేదీన మొత్తం ఎనిమిది మందితో కూడిన ప్యానెల్ వైస్ చైర్మన్ల జాబితాను రాజ్యసభ విడుదల చేసింది. ఇందులో విజయసాయి రెడ్డి పేరుతో పాటు భువనేశ్వర్ కలితా, హనుమంతయ్య, తిరుచ్చి, శివ, సుఖేందు శేఖర్ రాయ్, సస్మిత్ పాత్ర, సరోజ్ పాండే, సురేంద్ర సింగ్ నాగర్ పేర్లు ఉన్నాయి.
ప్యానెల్ వైస్ చైర్మన్గా తనకు అవకాశం కల్పించినందుకు విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా థ్యాంక్స్ చెప్పారు. అయితే బుధవారం మధ్యాహ్నం కొత్త చైర్మన్ జగదీప్ మాట్లాడుతూ… వైస్ చైర్మన్ల జాబితాను పునరుద్ధరించామని తెలిపారు. అయితే విజయసాయి రెడ్డి పేరు ఆయన పలకలేదు. అంతేకాదు, రాజ్యసభ రికార్డుల్లోను ఆయన పేరు లేదు.
రాజ్యసభ సచివాలయం బీఏసీకి సభ్యులను ఆహ్వానిస్తూ అయిదో తేదీన పంపిన నోటీసులో ప్యానెల్ వైస్ చైర్మన్ల జాబితాలో ఏడుగురు పేర్లు మాత్రమే ఉన్నాయి. ఆ జాబితాలో విజయసాయి రెడ్డి పేరు బీఏసీ సభ్యుడిగా ఉంది. ఆ తర్వాత అప్ డేట్ చేసిన రాజ్యసభ వెబ్ సైట్లో కూడా పేరు లేదు. విజయసాయి రెడ్డిని ప్యానెల్ వైస్ చైర్మన్ పదవి నుండి తొలగించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. వెంకయ్య నాయుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో విజయసాయి రెడ్డి రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్మన్గా ఉన్నారు.