జగన్ రాసిపెట్టుకో, వచ్చే ఎన్నికల్లో ప్రజలు నీకు రాజకీయ సమాధి కడతారు, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తారని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత అయ్యన్నపాత్రుడు మంగళవారం అన్నారు. 2019లో వైసీపీని గెలిపించి, జగన్ను ముఖ్యమంత్రిగా చేసినందుకు ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఆ తప్పు సరిదిద్దుకుంటారని చెప్పారు. బీసీలపై జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారని, కానీ ఆయనను ఎవరూ నమ్మరని చెప్పారు. బలహీన వర్గాలు అంటే వైయస్ కుటుంబానికి మొదటి నుండి కక్ష అని ఆరోపించారు. ఆ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తెలుగుదేశం హయాంలో అమలు చేసిన అన్ని పథకాలను రద్దు చేసి, బీసీలకు అన్యాయం చేశారన్నారు.
బీసీలకు జగన్ ఏం చేశారని వచ్చే ఎన్నికల్లో ప్రజలు 175 స్థానాలలో గెలిపిస్తారని ప్రశ్నించారు. అసలు బీసీలకు జగన్ చేసిన ప్రత్యేక కార్యక్రమం ఏమిటో చెప్పగలరా అని నిలదీశారు. రోడ్ల పైన పరదాలు లేకుండా బయటకు వెళ్లలేని జగన్ మళ్లీ ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. తమ అయిదేళ్ల టీడీపీ పాలనలో తాము ఏం చేశామనే అంశం జగన్ వద్ద లెక్కలు ఉన్నాయని తెలిపారు. బీసీలపై మాట్లాడే నైతిక హక్కు జగన్కు లేదన్నారు. ఐదుగురు రెడ్డి సామంతరాజులు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, మూడు రాజధానుల పేరుతో ఆడుకుంటున్నారని విమర్శించారు.
వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. జగన్ ప్రభుత్వం పైన ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని వ్యాఖ్యానించారు. కర్నూలులో జరిగిన రాయలసీమ గర్జన విఫలమైందని, ఆ సభకు జనాన్ని తరలించినా విజయవంతం కాలేదని ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వం కోట్లు గుమ్మరించి ప్రకటనలు ఇస్తోంది కానీ, అభివృద్ధి మాత్రం శూన్యం అన్నారు. చంద్రబాబు నాయుడు మళ్లీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారన్నారు.