ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని ఇటీవల కేంద్రమంత్రి కీలక ప్రకటన చేశారు. అయితే ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులు సభలో లేవనెత్తుతూనే ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో నాటి కాంగ్రెస్ పార్టీ బిల్లులో పెట్టకుండానే, ప్రత్యేక హోదా హామీని ఇచ్చింది. తాము బిల్లులోని ప్రతి హామీని నెరవేరుస్తున్నామని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం చెబుతోంది. ప్రత్యేక హోదా బిల్లులో లేదని, అలాగే ఇప్పుడు సాధ్యం కాదని, అయినప్పటికీ ప్రతి రాష్ట్రానికి నిధులు సరైన విధంగా ఇస్తున్నామని, నిధులను 2014లో 32 శాతం నుండి ఇప్పుడు 42 శాతానికి పెంచామని గుర్తు చేసింది కేంద్రం. అయినప్పటికీ తాజాగా వైసీపీ ఎంపీ భరత్ లోక్ సభలో ప్రత్యేక హోదా అంశాన్ని మంగళవారం ప్రస్తావించారు.
నాటి యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అశాస్త్రీయంగా విభజించిందని, విభజన ద్వారా ఏపీకి అన్యాయం జరిగిందని, ఇద్దరు సోదరులు విడిపోయినప్పుడు ఒకరికి ఆస్తులు ఎక్కువగా ఇచ్చి, మరొకరికి ఇవ్వకపోవడంపై తండ్రిగా కేంద్ర ప్రభుత్వం స్పందించాలన్నారు. ఈ సమయంలో స్పీకర్ జోక్యం చేసుకున్నారు. పదే పదే ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తెస్తున్నారని, అసలు మీకు ఎవరు హామీ ఇచ్చారని స్పీకర్ ఓం బిర్లా ఎంపీని ప్రశ్నించారు. విభజన బిల్లు ఎప్పుడు వచ్చింది, ఎవరు హామీ ఇచ్చారని అడిగారు. ఈ బిల్లు 2014లో వచ్చిందని, నాటి కాంగ్రెస్ అయిదేళ్లు ప్రత్యేక హోదా అడిగితే, వెంకయ్య నాయుడు పదేళ్లు అడిగారని తెలిపారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేక హోదా హామీ ఇచ్చినట్లు టీఎంసీ ఎంపీ సౌగత్ రాయ్ తెలిపారు.
మరో ఎంపీ మిధున్ రెడ్డి కూడా స్పందిస్తూ, విభజన హామీలను నెరవేర్చాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని, అలాగే ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. తాము (ఆంధ్రప్రదేశ్ ప్రజలు) విభజన కోరుకోలేదని, వారి అభిప్రాయానికి భిన్నంగా విభజన జరిగిందని, విభజన జరిగిన మొదటి సంవత్సరంలో తెలంగాణ తలసరి ఆదాయం రూ.15,454 కోట్లు కాగా, ఏపీ తలసరి రూ.8,979 కోట్లు మాత్రమే అన్నారు. అదే సమయంలో ఏపీలో 56 శాతం, తెలంగాణలో 45 శాతం జనాభా ఉందని గుర్తు చేశారు. అలాగే, తమపై రుణభారం 60 శాతం పడిందన్నారు. విభజన జరిగి ఎనిమిదేళ్లయినా హామీలు పూర్తి కాలేదన్నారు.