ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా శుక్రవారం సినీ నటుడు పోసాని కృష్ణమురళి బాధ్యతలు చేపట్టారు. దీనికి సంబంధించి ఏపీ సర్కార్ గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా పోసాని అధికారికంగా బాధ్యతలను చేపట్టారు. 2019 ఎన్నికల టైంలో పోసాని వైసీపీ తరపున జోరుగా ప్రచారం చేశారు. సీఎం జగన్ పోసానికి కీలక బాధ్యతలను అప్పజెప్పారు. విశాఖ కేంద్రంగా ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేసేందుకు పలు చర్యలు చేపట్టనున్నారు.
బాధ్యతలు స్వీకరించిన తరుణంలో పోసాని మీడియాతో మాట్లాడారు. తాను పదవి కోసం రాజకీయాల్లోకి రాలేదని, జగన్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి వచ్చానని అన్నారు. చచ్చే వరకూ కూడా జగన్‌తోనే నడుస్తానని, వైసీపీ జెండా మోస్తానని పోసాని తెలిపారు. పోసాని కృష్ణమురళీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీలో విశాఖ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయాలనేది సర్కార్ ఆలోచన. సినీ పరిశ్రమకు వంద ఎకరాలు కేటాయిస్తామని గతంలో ఏపీ సర్కార్ హామీ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలో పోసాని బాధ్యతలు చేపట్టడంతో అది నెరవేరుతుందని పలువురు ఆకాంక్షిస్తున్నారు.