First Bullet Train: మొదటి బుల్లెట్ రైలు ప్రత్యేకతల్ని వెల్లడించిన కేంద్ర రైల్వే మంత్రి
మన దేశంలో మరి కొద్ది రోజుల్లో బుల్లెట్ రైలు పరుగులు పెట్టడాన్ని మనం చూడబోతున్నాం. గంటకు గరిష్ఠంగా 320కి.మీ వేగంతో అది పరుగులు తీయనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
First Bullet Train Project In India : గంటలకు ఏకంగా 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ రైలు మన దేశంలో రాబోతోంది. ‘ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్’కి సంబంధించిన విశేషాలను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆ విశేషాలతో కూడిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. ప్రభుత్వం కలల్ని కాదు. వాస్తవాల్ని సృష్టిస్తోంది అంటూ రాసుకొచ్చారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడో దఫా ప్రభుత్వంలో భారతీయులు బుల్లెట్ రైలు(Bullet Train) దేశంలో పరుగులు తీయడాన్ని చూడనున్నారంటూ ఆయన అన్నారు. ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ ప్రాజెక్టు ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ అద్భుతం అంటూ అభివర్ణించారు. ఇది సాకారమైతే ఈ రైలు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలుగుతుంది. సరాసరిన రెండు గంటల్లో 508 కిలో మీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేయగలుగుతుంది.
దేశంలోనే తొలిసారి స్లాబ్ ట్రాక్ వ్యవస్థ, భూకంపాలను ముందుగానే పసిగట్టే ఏర్పాట్లు, 28 స్టీల్ బ్రిడ్జీలు, ఏడు సొరంగాలు, సముద్ర గర్భంలో ఏడు కిలోమీటర్ల పొడవైన టన్నెల్, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 12 రైల్వేస్టేషన్లు తదితర విశేషాలను మంత్రి వీడియోలో ప్రస్తావించారు. కాగా, ప్రాజెక్టు వ్యయం దాదాపు రూ.1.08 లక్షల కోట్లు. తొలి ప్రయోగాత్మక పరుగును 2026లో చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే మూడు గంటల్లోపే అహ్మదాబాద్ నుంచి, ముంబయి చేరుకోవచ్చు.