తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో పదవి లభించింది. ఆ పదవితో దేశంలోనే అరుదైన గౌరవం పొందారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ నేషనల్ గైడ్స్ కమిషనర్ గా కవిత నియామకమయ్యారు. ఈ విషయాన్ని భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ కౌషిక్ ప్రకటించారు. ఏడాది పాటు కవిత ఆ పదవిలో ఉండనున్నారు. ఇన్నాళ్లు రాష్ట్రంలో చేసిన సేవలు ఇకపై దేశవ్యాప్తంగా విద్యార్థులతో కలిసి కవిత చేయనున్నారు.
ప్రస్తుతం స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమిషనర్ గా కవిత బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్హిస్తుంటారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థుల భాగస్వామ్యం మరింతగా పెరిగేలా పని చేస్తానని ఈ సందర్భంగా కవిత తెలిపారు. ఈ బాధ్యతలు రావడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కవిత తెలంగాణ జాగృతి పేరును భారత్ జాగృతిగా మార్చారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు భారత్ జాగృతి కూడా దేశవ్యాప్తంగా పని చేస్తుందని ఇటీవల కవిత పేర్కొన్నారు. దేశ ప్రజలను జాగృతం చేయడమే భారత్ జాగృతి లక్ష్యమని స్పష్టం చేశారు.