»Sarkaaru Noukari Movie Review How Is Singer Sunitha Tanayudis Movie
Sarkaaru Noukari Movie Review: సింగర్ సునీత తనయుడి మూవీ ఎలా ఉందంటే?
సింగర్ సునీత తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన చిత్రం సర్కారి నౌకరి. కొత్త ఏడాది మొదటిరోజున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మొదటి సినిమాతో ఆకాశ్ హిట్ కొట్టాడో లేదో తెలుసుకుందాం.
ప్రముఖ సింగర్ సునీత కొడుకు ఆకాశ్ హీరోగా, భావన హీరోయిన్గా వచ్చిన సినిమా సర్కారు నౌకరి. దర్శకుడు రాఘవేంద్రరావు నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రంలో మధులత, మహాదేవ్, తనికెళ్ల భరణి పలువురు ముఖ్య పాత్రల్లో నటించారు. 1990లో ఎయిడ్స్ వచ్చిన కొత్తలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కొత్త సంవత్సరం కానుకగా ఈరోజు సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్‌కు చెందిన కుర్రాడు గోపాల్ (ఆకాశ్ గోపరాజు) అనాథ. కష్టపడి ప్రభుత్వ హెల్త్ డిపార్టమెంట్లో ఉద్యోగం సాధిస్తాడు. ఈక్రమంలో తన సొంత మండలానికి హెల్త్ ప్రమెటర్గా వస్తాడు. అయితే ఎయిడ్స్‌పై అవగాహన కల్పించడం, ఊరూరా తిరిగి కండోమ్‌లు పంచడం గోపాల్ పని. తర్వాత సత్య (భావన) అనే అమ్మాయిని ప్రేమించి పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకుంటాడు. మొదట్లో తన భర్తది సర్కారు నౌకరి అని సత్య ఆనందానికి అవధులుండవు. కానీ తర్వాత అతని చేసే పని తెలిసి అసహ్యించుకోవడం మొదలు పెడుతుంది. ఆ సమయంలో ఎయిడ్స్ గురించి ప్రజలకు అవగాహన లేదు. అలాంటివాళ్లకి గోపాల్ అవగాహన కల్పించి కండోమ్‌లు పంచేవాడు. ఇతనిని చూసి గ్రామంలోని ప్రజలంతా రకరకాలుగా హేళన చేసేవారు. అలాగే వాళ్ల కుటుంబాన్ని అంటరాని వాళ్లుగా చూసేవారు. ఆ అవమానాలు తట్టుకోలేక సత్య గోపాల్‌ను ఉద్యోగం మానేయంటుంది. కానీ గోపాల్ అంగీకరించకపోవడంతో సత్య పుట్టింటికి వెళ్లిపోతుంది. తర్వాత ఏమైంది? తన ఉద్యోగం కోసం గోపాల్ భార్యను ఎందుకు కాదనుకున్నాడు? ఊరువాళ్లు హేళన చేస్తున్నా హెల్త్ వర్కర్‌గానే ఎందుకు పని చేయాలనుకున్నాడు? ఈక్రమంలె అతను ఎదుర్కొన్న సవాళ్లేంటి? అతని గతమేంటి? అనే విషయాలు తెలసుకోవాలంటే మూవీ చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
1996లో కొల్లాపూర్‌లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటల్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు సినిమాను చూపించాడు. ఫస్టాఫ్‌లో గోపాల్, సత్య మధ్య పెళ్లి, కాపురం, కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, కొంచెం కామెడీతో సాగుతుంది. అయితే ఆకాలంలో ఎయిడ్స్ గురించి అంత అవగాహన ఉండేది కాదు. ఎయిడ్స్‌తో మరణించిన కుటుంబాల్ని వెలివేయడం, వ్యాధి పట్ల అవగాణ కల్పించే హెల్త్ వర్కర్లను చిన్న చూపు చూసేవారు. ఈ పరిస్థితులన్నింటినీ సర్కారు నౌకరిలో కళ్లకు కట్టినట్లు చూపించారు. సాధారణంగానే సాగిన ఈ సినిమా గోపాల్ పెళ్లి ఎపిసోడ్‌తో ఆసక్తికరంగా మొదలవుతుంది. గ్రామాల్లో ఏర్పాటు చేసిన డబ్బాల్లో కండోమ్‌లు వేయడం, అవేంటో తెలియక పిల్లలు వాటిని బుడగల్లా చేసుకుని ఆడుకోవడం వంటి సన్నివేశాలు కొంత నవ్వులు పంచుతాయి. తన భార్య సత్యకు విషయం తెలిసే సరికే ద్వితీయార్థంలో సంఘర్షణలు మొదలవుతాయి. ఎక్కువగా ఎయిడ్స్ వ్యాధి ఎక్కువై వరుస మరణాలు సంభవించడం.. ఈక్రమంలో గోపాల్ తన స్నేహితుడుని కూడా కోల్పోతాడు. మరోవైపు తన భార్యకు దూరమై అతను పడే ఆవేదన, గోపాల్ గతం గురించి చూపించే సన్నివేశాలు ఎమోషనల్‌గా ఉంటాయి. కాకపోతే ముగింపు ఊహాలకు అందే విధంగా ఉంటుంది.
ఎవరెలా చేశారంటే?
సునీత కుమారుడు ఆకాశ్ పల్లెటూరి కుర్రాడిగా గోపాల్ పాత్రలో సహజంగా కనిపిస్తాడు. భావోద్వేగభరితమైన సన్నివేశాల్లో నటన పతాక స్థాయిలో ఉంటుంది. సత్య పాత్రలో భావన ఒదిగిపోయింది. ఎవరి పాత్రకు మేర వాళ్లు నటించారు. అయితే ఈ కథ ప్రస్తుతం తరానికి అంతగా కనెక్ట్ కాకపోవచ్చు.
సాంకేతిక విభాగం
సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయ్యింది. ప్రతి ఎమోషనల్ సీన్‌ని మ్యూజిక్‌తో ఇంకో రేంజ్‌కి తీసుకెళ్లాడు. కెమెరా విజువల్స్ ఆ కాలానికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
+కథా నేపథ్యం
+అక్కడక్కడా వచ్చే కొన్ని కామెడీ సన్నివేశాలు
+కథలోని భావోద్వేగాలు
మైనస్ పాయింట్స్
-ప్రథమార్థంలో కొన్ని సన్నివేశాలు
-ముగింపు
-కథను నడిపించే తీరు