జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెస్ట్ ఆర్టిస్ట్‌లా వచ్చి టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. పొత్తుల గురించి ఆయన చెప్పిన మూడు ఆప్షన్స్ వింటే నవ్వొస్తోందన్నారు. షరతులు లేకుండా చంద్రబాబుకి సపోర్టు చేయడం అనే నాలుగో ఆప్షన్ కూడా చెప్పాల్సిందని ఎద్దేవా చేశారు. గత రెండు ఎన్నికల మాదిరిగా ఈసారి కూడా పవన్ రిమోట్ చంద్రబాబు చేతుల్లో ఉంటుందని కామెంట్ చేశారు.
సీఎం అభ్యర్థి ఎవరో..?
లోకేశ్, పవన్, చంద్రబాబులో సీఎం అభ్యర్థి ఎవరో ప్రజలకు చెప్పాలని సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ అంటే జగన్, జగన్ అంటే వైసీపీ అని తాము స్పష్టంగా ఉన్నామని తెలిపారు. వారు ఎందుకు స్పష్టంగా చెప్పడం లేదని ప్రశ్నించారు. విడిగా వచ్చినా.. కలిసి వచ్చినా తమకు ఓకే అని సవాల్ చేశారు. నారా లోకేశ్ పాదయాత్రను టీడీపీ ఎక్కువగా ఊహించుకుంటుందని విమర్శించారు. జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ఉన్న నిబంధనలే ఇప్పుడు ఉన్నాయని వివరించారు. ఆంక్షలకు లోబడే జగన్ పాదయాత్ర చేశారని తెలిపారు. అప్పుడు జగన్ ఏమీ అనలేదని గుర్తుచేశారు. కందుకూరు ఘటన నేపథ్యంలో రోడ్లపై సభల విషయంలో నిషేధం విధించామని వివరించారు.
పవన్.. ఆధారాలు ఏవీ?
సబ్‌ప్లాన్ నిధులు దుర్వినియోగం చేశామని ఏ ఆధారాలతో పవన్ కల్యాణ్ అంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. సబ్‌ప్లాన్ కంటే ఎక్కువగా నిధులు అందిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు ఐదేళ్లలో రూ. 33 వేల కోట్లు ఖర్చు చేశారని, జగన్ మూడేళ్లలో రూ. 48 వేల కోట్లు నిధులు ఇచ్చారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు సీఎం జగన్ పదవులు ఇచ్చారని వివరించారు.
లోకేశ్ యువగళం
నారా లోకేశ్ చేపట్టే యువగళం పాదయాత్ర రేపు (శుక్రవారం) ప్రారంభం అవుతుంది. ఆంక్షలతో కూడిన అనుమతిని ప్రభుత్వం ఇచ్చింది. జీవో నంబర్ 1 సరికాదని టీడీపీ నేతలు అంటున్నారు. తమ ప్రభుత్వం పాదయాత్ర చేసేందుకు జగన్‌కు అనుమతిచ్చామని స్పష్టంచేసింది. సజ్జల మాత్రం జగన్‌కు కూడా ఆంక్షలు విధించారని చెబుతున్నారు. కందుకూరు, గుంటూరు తొక్కిసలాటలో 11 మంది వరకు చనిపోవడంతో.. సభలు, సమావేశాలు, ర్యాలీలపై ఏపీ సర్కార్ నిషేధం విధించింది. ఈ మేరకు జీవో నంబర్ 1 జారీచేసింది.