Tax కట్టేవారికి రైతుబంధు ఎందుకు..? ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్
ఇన్ కం టాక్స్ కట్టేవారికి రైతుబంధు ఇవ్వడం కరెక్ట్ కాదని.. అలాగే 5 లేదంటే 10 ఎకరాల భూమి ఉన్నవారికే రైతుబంధు అమలు చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టంచేశారు.
MLC Jeevan Reddy: రైతుబంధుపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి (Jeevan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వానికి ఆదాయపు పన్ను కట్టేవారికి, వందల వేల ఏకరాల భూమి ఉన్న వారికి రైతుబంధు ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. రైతుబంధును అనర్హులకు ఇవ్వబోమని తేల్చిచెప్పారు. సాగుభూమికి, సేద్యం చేసేవారికి రైతుబంధు ఇచ్చేలా తమ ప్రభుత్వం మార్పులు చేస్తుందని తెలిపారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలో రాళ్ల వాగు ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడారు.
ఇప్పటికే సాగు పనులు మొదలయ్యాయని జీవన్ రెడ్డి (Jeevan Reddy) తెలిపారు. అందుకే పాత పద్ధతిలో రైతుబంధు నిధులు విడుదల చేశామని గుర్తుచేశారు. 5 ఎకరాలు లేదంటే 10 ఎకరాలు ఉన్నవారికే రైతుబంధు ఇవ్వాలనే ప్రతిపాదన పరిశీలిస్తున్నామని జీవన్ రెడ్డి (Jeevan Reddy) తెలిపారు. దీనికి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తోందని తెలిపారు. రైతు భరోసా పథకంతోపాటు రూ.2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధివిధానాలపై ప్రభుత్వం చర్చిస్తోందని తెలిపారు.
రైతు భరోసా విధి విధానాలను రూపొందించి త్వరలో రైతు కూలీలను ఆదుకుంటామని వివరించారు. రైతు రుణమాపీ నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. యాసంగి పంటకు సంబంధించి కోతలు లేకుండా కొనుగోలు చేస్తామని తెలిపారు. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జీవన్ రెడ్డి (Jeevan Reddy) పోటీ చేసి ఓడిపోయారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ మంత్రిగా అవకాశం రాలేదు. మంత్రివర్గ విస్తరణ సమయంలో అవకాశం వస్తుందని ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి సీనియర్ నేత.. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది.