Telangana: నూతన సీఎంగా రేవంత్ రెడ్డి..ముగిసిన ప్రమాణ స్వీకారం
తెలంగాణ నూతన సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ గవర్నర్ తమిళసై ఈ సందర్భంగా అందరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానుల్లో సంబరాలు నెలకొన్నాయి.
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.21 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ గవర్నర్ సౌందరరాజన్ తమిళసై రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులతో కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్కతో పాటుగా మరో 10 మంది ఎమ్మెల్యేలు నేడు మంత్రులగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావులతో తెలంగాణ గవర్నర్ తమిళసై మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రుల్లో అందరూ తెలుగులో ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ దామోదర రాజనర్సింహ మాత్రం ఇంగ్లీష్ భాషల్లో ప్రమాణ స్వీకారం చేశారు.
ఎల్బీ స్టేడియం వద్ద కాంగ్రెస్ అభిమానులు, కార్యకర్తల సంబరాలు:
Celebrations on High for Telangana Chief Minister Revanth Reddy Swearing -in Ceremony.
ఈ ప్రమాణ స్వీకార వేడుక అంగరంగా వైభవంగా సాగింది. సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వంటివారు కార్యక్రమానికి హాజరై అభినందించారు. కార్యక్రమానికి 300 మంది అమరవీరుల కుటుంబాలు, మరో 250 మంది తెలంగాణ ఉద్యమకారులు, ఇతర రాష్ట్రాల నేతలు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.