సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వందలు, వేల మంది రోజు తిరుగుతుంటారు. ఎవరైనా కథ వినకపోతారా? ఎవరైనా సినిమాల్లోకి తీసుకోకపోతారా? ఎవరైనా అవకాశం ఇవ్వకపోతారా? అంటూ ఫొటోలు, కథలు, రచనలు పట్టుకుని స్టూడియోలు, ప్రొడ్యూసర్, హీరోహీరోయిన్ల కోసం గాలిస్తుంటారు. ఈ సందర్భంగా కొందరి ఇళ్ల వద్ద పడిగాపులు కాస్తుంటారు. అపాయింట్ మెంట్ కోసం కాళ్లరిగేలా తిరుగుతారు. అలాంటి అమాయకులను కొందరు మోసగాళ్లు చాలా సులువుగా మోసం చేసేస్తుంటారు. అవకాశం కోసం చూస్తున్న వారిని అదే అదునుగా భావించి అందినకాడికి దోచుకుని మోసం చేస్తుంటారు. ఇలా సినీ ప్రపంచంలో ఎంతో మంది మోస పోతుంటారు. ఈసారి ఓ పెద్ద మోసమే జరిగింది. స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి పేరు చెప్పి ఓ నిర్మాతను రూ.51 లక్షలు కాజేశాడు. బాధితుడు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.
బాధితుడు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ధమాన నిర్మాత లక్ష్మణ్ చారి విశ్వకర్మ క్రియేషన్స్ అనే పేరు మీద బ్యానర్ ఫిలిం చాంబర్ లో రిజిస్ట్రేషన్ చేశాడు. తన బ్యానర్ కింద సినిమాలు నిర్మిద్దామనే ఆలోచన చేస్తున్నాడు. ఈ క్రమంలో కె.ఎల్లారెడ్డి అనే వ్యక్తి తనను తాను మేనేజర్ గా చెప్పుకున్నాడు. హీరో అనుష్క శెట్టి, సంగీత దర్శకుడు మణిశర్మ అపాయింట్ మెంట్ ఇప్పిస్తానని నమ్మించాడు. అనుష్క అపాయింట్ మెంట్, డేట్స్ కోసం రూ.26 లక్షలు వసూలు చేశాడు. అనంతరం హీరోయిన్ కలిసేందుకు లక్ష్మణా చారిని బెంగళూరుకు కూడా తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన ప్రతిసారి ఏదో కారణం చెప్పి అనుష్కను కలవకుండా తిరిగి వచ్చేసే వారు. ఆ తర్వాత మణిశర్మను కూడా కలిసేందుకు రూ.25 లక్షలకు పైగా వసూల్ చేశాడు.
రెండేళ్ల నుంచి తిప్పించుకుంటున్నాడు కానీ ఇద్దరినీ కలిసే అవకాశం కల్పించడం లేదు. దీంతో ఎల్లారెడ్డిని లక్ష్మణా చారి నిలదీశాడు. వారిని కలిసే అవకాశం లేకుంటే తాను ఇచ్చిన డబ్బులు తిరిగివ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఎంతకు ఇవ్వకపోడం.. సక్రమంగా సంప్రదించకపోవడంతో ఫిలిం చాంబర్ ను సంప్రదించాడు. దీంతో దిగొచ్చిన ఎల్లారెడ్డి కొద్ది రోజుల్లో డబ్బులు ఇస్తానని నమ్మించాడు. చెప్పి నెలలైనా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో లక్ష్మణా చారి పోలీసులను ఆశ్రయించాడు. ఎల్లారెడ్డి చేసిన మోసాలపై ఈ సందర్భంగా లక్ష్మణా చారి ఓ వీడియో విడుదల చేశాడు. పోలీసులు, ఫిలిం చాంబర్ ప్రతినిధులు కలిసి తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు.