»Love At First Sight Five Years Of Love A Couple About To Become One Beyond Obstacles
Love at first sight: ఐదేళ్ల ప్రేమ.. ఆటంకాలు దాటి ఒక్కటి కాబోతున్న జంట
తల్లి మొబైల్లో ఫొటో చూసి మొదటి చూపులోనే మనసు పారేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే తననే చేసుకుంటానని కుటుంబ సభ్యులను చెప్పాడు. కుమారుడి సంతోషం మేరకు తల్లిదండ్రులు ఒప్పుకున్నా.. ఆమెది పాకిస్థాన్ కావడంతో ఇబ్బందులు తప్పలేదు.
Love at first sight: తల్లి మొబైల్లో అమ్మాయి ఫొటో చూసి మొదటి చూపులోనే ఓ యువకుడు మనసు పారేసుకున్నాడు. పెళ్లంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన అభిప్రాయాన్ని తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించాడు. కొడుకు ఇష్టాన్ని గౌరవించిన ఆ తల్లిదండ్రులు.. అమ్మాయి కుటుంబంతో కూడా మాట్లాడారు. ఇరు కుటుంబాలు పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ, ఆ అమ్మాయిది పాకిస్థాన్ కావడంతో కరోనా, వీసా సహా పలు ఆటంకాలు ఎదురుకావడంతో ఐదేళ్ల పాటు నీరిక్షించాల్సి వచ్చింది. చివరికి ఈ జంట వచ్చే ఏడాది ఒక్కటి కాబోతోంది. పాకిస్థాన్‌కు చెందిన యువతి వాఘా, అటారీ అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లోకి చేరుకోగా.. కాబోయే అత్తింటివాళ్లు ఆమెకు బాజా భజంత్రీలతో ఘనస్వాగతం పలికారు. కోల్‌కతాకు చెందిన యువకుడు సమీర్‌ఖాన్ జర్మనీలో ఉన్నత చదువులు చదువుకున్నాడు. అక్కడ నుంచి ఐదేళ్ల కిందట 2018 మేలో భారత్‌కు వచ్చిన సమీర్.. తన తల్లి ఫోనులో కరాచీకి చెందిన జావెరియా ఖానుమ్ ఫొటో చూసి ఇష్టపడ్డాడు.
భారత్‌కు వచ్చేందుకు వీసా కోసం ప్రయత్నించగా.. రెండు సార్లు తిరస్కరించారు. మళ్లీ ఇంతలో కరోనా మహమ్మారి రూపంలో ఆటంకం వచ్చి పడింది. ఇలా అయిదేళ్లు గడిచిపోయాయి. ఇటీవల జావెరియాకు 45 రోజుల గడువుతో భారత్ వీసా మంజూరయ్యింది. భారత్‌లోకి అడుగుపెట్టిన ఆమె అమృత్సర్ నుంచి కోల్‌కతాకు చేరుకుంది. జావెరియాకు వీసా మంజూరు చేసినందుకు భారత ప్రభుత్వానికి సమీర్‌ఖాన్ కృతజ్ఞతలు తెలిపాడు. జావెరియా మాట్లాడుతూ.. నాకు 45 రోజుల వీసా మంజూరయ్యింది. ఇక్కడకు రావడం చాలా ఆనందంగా ఉంది.. ఇలా వచ్చానో లేదో చాలా ప్రేమను పొందాను. రెండుసార్లు వీసా కోసం ప్రయత్నించాను. ఈసారి మాత్రం అదృష్టవశాత్తూ మంజూరయ్యిందని తెలిపింది.