»Central Government To Provide Drones To Dwakra Womens
Drones: డ్వాక్రా మహిళలకు డ్రోన్లు.. కేంద్రం అందిస్తోన్న సరికొత్త పథకం
కేంద్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు డ్రోన్లను ఇవ్వనుంది. డ్రోన్లపై శిక్షణ ఇచ్చి వారి ఉపాధికి తోడ్పడనుంది. ఈ డ్రోన్లను రైతులకు అద్దెకు ఇచ్చి మహిళా సంఘాలు ఆదాయం పొందొచ్చు. కేంద్రం అందించే ఈ డ్రోన్ల సాయంతో ఎరువుల వాడకం, పురుగు మందుల పిచికారీ వంటివి చేయొచ్చు.
మహిళల కోసం సరికొత్త పథకాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తోంది. అందులో భాగంగా తాజాగా సరికొత్త పథకాన్ని మరోసారి అందుబాటులోకి తేనుంది. స్వయం సహాయక సంఘాలకు కేంద్రం డ్రోన్లను అందించేందుకు సిద్ధమైంది. ఆ డ్రోన్లను రైతులకు అద్దెకు ఇచ్చి వాటి ద్వారా మహిళలు ఉపాధి పొందొచ్చు. ఇటువంటి అద్భుత పథకాన్ని కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. 2023 నుంచి 2026 మధ్యా కాలంలో డ్రోన్లను డ్వాక్రా మహిళలకు కేంద్రం ఇవ్వనుంది.
సుమారు 15 వేల డ్రోన్లను డ్వాక్రా మహిళలకు అందించేందుకు కేంద్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేంద్ర కేబినెట్ కూడా ఆ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం కోసం రూ.1,261 కోట్లను కేంద్ర ప్రభుత్వం కేటాయించనున్నట్లు వెల్లడించింది. లబ్దిదారులకు ఇందుకోసం అత్యధికంగా రూ.8 లక్షల వరకూ సాయాన్ని అందించనున్నట్లు తెలిపింది. డ్రోన్లు పొందిన స్వయం సహాయక మహిళా సంఘాల వారికి డ్రోన్ పైలెట్ శిక్షణను ఇవ్వనున్నారు.
అలాగే 10 రోజుల పాటు వ్యవసాయ సంబంధ పనులపై శిక్షణను ఇచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ డ్రోన్ల సాయంతో రైతులు పురుగు మందులను పిచికారీ చేయొచ్చు. అలాగే ఎరువు వాడకాన్ని కూడా చేపట్టవచ్చు. డ్రోన్ల సాయంతో ఈ వ్యవసాయ పనులు ఎంతో సులభంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. దీని వల్ల సమయం ఆదా కూడా అవుతుంది. అంతేకాకుండా మానవ వనరుల కొరతను కూడా అధిగమించవచ్చు. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు ఉపాధి పెరుగుతుంది. గణనీయంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని కేంద్రం భావిస్తోంది.