తెలుగు హీరో విష్ణు మంచు నటిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'కన్నప్ప(Kannappa)' ఫస్ట్‌లుక్(first look) పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే నేడు ఈ హీరో బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆ క్రేజీ పోస్టర్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి మరి.
ఈరోజు(నవంబర్ 23న) టాలీవుడ్ హీరో విష్ణు మంచు(Vishnu Manchu) పుట్టినరోజు సందర్భంగా అతను యాక్ట్ చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక మూవీ కన్నప్ప(Kannappa) నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్లో విష్ణు ఒక యోధుని మాదిరిగా కనిపిస్తున్నాడు. బాణాన్ని శివ లింగం ఆకారానికి ఎక్కుపెట్టగా…చుట్టూ పచ్చని ప్రాంతంతో ఉన్న కొండల దృశ్యాలు వావ్ అనిపిస్తున్నాయి. అంతాకాదు కొండల నడుమ శివలింగం మాదిరిగా పారుతున్న జలపాతం కూడా చాలా అద్భుతంగా ఉంది. అయితే ఈ పోస్టర్లో విష్ణు ముఖం మాత్రం కనిపించడం లేదు. విల్లు ఎక్కు పెట్టిన వెనుక వైపు దృశ్యాలు మాత్రమే కనిపిస్తున్నాయి.
ముఖేష్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి కథను పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ సంయుక్తంగా రాశారు. ఈ సినిమాలో కృతి సనన్ సోదరి నూపుర్ సనన్, మహిళా కథానాయికగా ఎంపికైంది. అయితే నిరంతర జాప్యాలు మరియు డేట్ గొడవల కారణంగా ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్, మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్ అతిధి పాత్రల్లో యాక్ట్ చేస్తారని ఇప్పటికే విష్ణు ప్రకటించారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంగీతం అందించనున్నారు. ఇంగ్లీష్, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.
ఈ భారీ బడ్జెట్ చిత్రం ‘కన్నప్ప’ షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్(new zealand)లో శరవేగంగా జరుగుతోంది. మరోవైపు కొన్ని వారాల క్రితం విష్ణు మంచు యాక్షన్ సీక్వెన్స్‌లో పని చేస్తున్నప్పుడు ప్రమాదానికి గురయ్యాడు. అక్కడ డ్రోన్‌ను ఉపయోగించి షాట్లను దగ్గరగా చిత్రీకరించారు. న్యూజిలాండ్‌లో జరిగిన ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో మంచు విష్ణు చేతికి డ్రోన్ ఢీకొట్టడంతో అతనికి గాయాలయ్యాయి. ఈ దురదృష్టకర ప్రమాదం తర్వాత షూటింగ్‌ను ఆపివేశారు. ఆ వెంటనే విష్ణు మంచును వైద్య చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.