»Niti Aayog Sensational Report More Than 10 Lakh Teacher Posts Are Vacant In The Country
Niti Aayog: సంచలన నివేదిక..దేశంలో 10 లక్షలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీ!
పాఠశాలల్లోని విద్య, నాణ్యతా ప్రమాణాలపై నీతి ఆయోగ్ షాకింగ్ నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగానే ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని, వాటిని భర్తీ చేయకుంటే విద్యలో నాణ్యత చూపే అవకాశం ఉండదని స్పష్టం చేసింది. అత్యధిక శాతం పట్టణాల్లోనే టీచర్లు ఉంటున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉండటం వల్ల విద్యలో లోపం కనిపిస్తోందని తేల్చింది. విద్యలో నాణ్యత తీసుకురావాలంటే కచ్చితంగా పెద్ద ఎత్తున ఖాళీల భర్తీని చేపట్టాలని సూచించింది.
భారత్ లోని విద్యా వ్యవస్థపై నీతి ఆయోగ్ (Niti Aayog) ఓ సంచలన నివేదికను (Shocking Report) విడుదల చేసింది. పాఠశాలల విలీనం, ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్స్, విద్య, శిక్షణలో తెచ్చిన సంస్కరణలకు సంబంధించి నీతి ఆయోగ్ ఓ నివేదికను రూపొందింది. విద్యలో నాణ్యత పెంచడానికి కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది. భారత్‌లో చైనా కంటే ఐదు రెట్లు ఎక్కువగా పాఠశాలలు ఉన్నాయని, కానీ అనేక రాష్ట్రాల్లో 50 శాతం కంటే ఎక్కువగా ప్రాథమిక పాఠశాలల్లో నమోదు శాతం 60 కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించింది.
దేశ వ్యాప్తంగా ప్రైవేట్ పాఠశాలల్లో 265 మంది విద్యార్థులకు 9 మంది టీచర్లే ఉన్నారని, అయితే 4 లక్షలకు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 50 మందిలోపు విద్యార్థులకు ఒకరిద్దరు మాత్రమే ఉపాధ్యాయులు ఉన్నట్లు నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ 10 లక్షలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రాష్ట్రాల్లో చూస్తే 30 నుంచి 50 శాతం వరకూ ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు నీతి ఆయోగ్ నివేదిక తెలిపింది.
ఇలా ఉపాధ్యాయుల కొరత ఉండటం తీవ్రంగా ఆందోళన కలిగిస్తోందని, ఈ కొరతను నివారించడానికి అదనపు టీచర్ కేడర్‌ను సృష్టించాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది. విద్యలో నాణ్యత తీసుకురావాలంటే కచ్చితంగా పెద్ద ఎత్తున ఖాళీల భర్తీ చేపట్టితీరాలని ఈ నివేదిక సూచించింది.
మరోవైపు పట్టణాల్లో అత్యధిక టీచర్లు ఉన్నారని, గ్రామీణ ప్రాంతాల్లో టీచర్ల ఖాళీలు ఎక్కువగా ఉన్నాయని నివేదికి వెల్లడించింది. ఈ వ్యత్యాసం వల్ల ఉత్తమ ఫలితాలను విద్యార్థులు సాధించలేకపోతున్నారని, ఆ సమస్యను పరిష్కరించడం అంత సులభమేమీ కాదని, ఆ సమస్య పరిష్కారానికి రాష్ట్రాలపై భారీ ఆర్థిక భారం పడుతుందని నివేదిక గుర్తించింది. ఈ తరుణంలో పట్టణాల్లో అధికంగా ఉన్న ఉపాధ్యాయులను గ్రామీణ ప్రాంతాలకు తరలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నీతి ఆయోగ్ నివేదిక స్పష్టం చేసింది.