అన్ని రాజకీయ బాధ్యతల నుంచి వైదొలుగాలని భావిస్తున్నట్లు మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రకటించారు. 80 ఏళ్ల వయసులో అన్ని బాధ్యతలు విరమించుకుని మిగిలిన శేషజీవితంలో రాయడం, చదవడం వంటి పనులతో కాలక్షేపం చేస్తానని తెలిపారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ వేదికగా ప్రకటించి సంచలనం రేపారు. ఈ విషయమై ఇటీవల ముంబై పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పినట్లు వివరించారు.
ఈ మేరకు సోమవారం భగత్ సింగ్ కోశ్యారీ ట్వీట్ చేశారు. ‘సంఘ సంస్కర్తలు, వీరయోధులు పుట్టిన గడ్డ మహారాష్ట్ర లాంటి గొప్ప రాష్ట్రానికి రాజ్య సేవకుడిగా సేవలు అందించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఇటీవల ప్రధాని మోదీ ముంబై పర్యటనకు వచ్చిన సమయంలో ఆయనతో ఓ విషయాన్ని పంచుకున్నా. అన్ని రాజకీయ పదవుల నుంచి నేను వైదొలగాలని అనుకుంటున్నట్లు చెప్పా. నా శేష జీవితం అంతా రాయడం, చదవడంతో పాటు ఇతర కార్యకలాపాలతో గడపాలని భావిస్తున్నా. ప్రధాని మోదీ నాపై ఎప్పుడూ అభిమానం కనబరుస్తారు. ఈ విషయంలోనూ అలాగే స్పందిస్తారని ఆశిస్తున్నా’ అని ట్విటర్ లో తెలిపారు.
2019లో గవర్నర్ గా నియమితులైన కోశ్యారీ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఛత్రపతి శివాజీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ గా తీసుకున్న నిర్ణయాలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. గత మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం నామినేట్ చేసిన 12 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను తిరస్కరించి సంచలనం రేపారు. అయితే కొన్నాళ్ల నుంచి గవర్నర్ పదవి నుంచి వైదొలుగాలని కోశ్యారీ భావిస్తున్నారు. మలి వయసులో బాధ్యతలను భారంగా భావిస్తున్నట్లు సమాచారం.