»Niharikas New Project Varun And Lavanya Come Together
Niharika కొత్త ప్రాజెక్ట్.. కలిసొచ్చిన వరుణ్, లావణ్య!
మెగా డాటర్ నిహారిక కొత్త ప్రాజెక్ట్ షురూ అయింది. విడాకుల తర్వాత పూర్తిగా సినిమాలపైనే ఫోకస్ చేసిన నిహారిక.. తాజాగా ఓ సినిమాకు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా పెళ్లి తర్వాత వరుణ్, లావణ్య ఫస్ట్ కలిసి బయటికొచ్చారు.
Niharika's new project.. Varun and Lavanya come together!
Niharika: ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటయ్యారు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. పెళ్లి తర్వాత ఇప్పటి వరకు కలిసి బయట కనిపించలేదు. మెగా డాటర్ నిహారిక కోసం హైదరాబాద్‌లో జరిగిన మూవీ షూటింగ్ ప్రారంభోత్సవానికి ఇద్దరు కలిసి హాజరయ్యారు. ఇప్పటి వరకు వెబ్ సిరీస్ చేసిన నిహారిక ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై ప్రొడ్యూసర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది. శుక్రవారం రోజు పూజా కార్యక్రమాలతో కొత్త చిత్రాన్ని ప్రారంభించింది. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠితోపాటు అల్లు అరవింద్, నాగబాబు దంపతులు ఈ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక కూడా ఈ ఓపెనింగ్ కార్యక్రమానికి హాజరయ్యారు. కొత్త నటీనటులతో నిహారిక మూవీ నిర్మిస్తోంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్ఎల్పీ, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్‌పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాకతో కలిసి నిర్మిస్తోంది నిహారిక. ఈ మూవీని వరుణ్ తేజ్ క్లాప్ కొట్టి ప్రారంభించాడు. నాగబాబు కెమెరా ఆన్ చేశారు. అల్లు అరవింద్ యాక్షన్ చెప్పారు. ఈ మూవీతో యాదు వంశీ అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.
నిహారిక మాట్లాడుతూ.. ‘మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో ఇప్పటివరకు వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్ చేశాం. తొలిసారి ఫీచర్ ఫిల్మ్ ప్రారంభించాం. కొత్తవాళ్లతో సినిమా చేయడం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను’ అని చెప్పుకొచ్చింది. ఏదేమైనా.. పెళ్లి తర్వాత వరుణ్, లావణ్య తొలిసారి బయట జంటగా కనిపించడంతో మెగాభిమానులు ఖుషీ అవుతున్నారు.