»Good News For Ap Farmers Rs 7800 Crore Compensation Under Crop Insurance
CM Jagan: ఏపీ రైతులకు శుభవార్త..పంట బీమా కింద రూ.7,800 కోట్ల పరిహారం
ఏపీలో రైతులకు అన్ని రకాలుగా మేలు చేస్తామని, గత నాలుగేళ్లలో రూ.7,800 కోట్లను పంట బీమా కింద అందించినట్లు సీఎం జగన్ తెలిపారు. కడప పర్యటనలో ఆయన రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన కారుకు స్వల్ప ప్రమాదం జరిగింది. వేరే కారులో జగన్ ఇడుపులపాయలోని ఎస్టేట్‌కు చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రైతులకు సీఎం జగన్ (Cm Jagan) సర్కార్ శుభవార్త చెప్పింది. పంటల బీమా కింద రూ.7,800 కోట్ల పరిహారం ఇచ్చినట్లు వెల్లడించింది. నేడు ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించారు. తన సొంత నియోజకవర్గం అయిన పులివెందులలో ఆయన ఇడుపులపాయ వద్ద రూ.1.75 కోట్లతో నిర్మించిన ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత వేముల మండలంలో ప్రజాప్రతినిధులు, స్థానికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరువు మండలాలను ప్రకటించి తమకు సాయం చేయాలని రైతులు కోరారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..అర్హులందరికీ పంటల బీమా వర్తింపజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు, రాయితీలు అన్నీ అర్హులకు అందిస్తామన్నారు. గత నాలుగేళ్లలో ఉచిత పంటల బీమా కింద రైతులకు రూ.7,800 కోట్ల పరిహారం ఇచ్చినట్లు తెలిపారు. గతంలో చంద్రబాబు కరువు మండలాలను ప్రకటించినా రైతులకు ఎటువంటి లాభం చేకూరలేదన్నారు. ప్రభుత్వ సాయం రైతులందరికీ వచ్చి తీరుతుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
సీఎం జగన్‌కు తప్పిన ప్రమాదం:
ఏపీ సీఎం జగన్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లో కారుకు ప్రమాదం జరిగింది. వేముల మండలంలో వైసీపీ నేతలతో సమీక్షించిన తర్వాత ఇడుపులపాయకు జగన్ తిరుగు ప్రయాణం అయ్యారు. మార్గమధ్యలో ప్రమాదం సంభవించింది. వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కారును కాన్వాయ్ లోని మరో కారు ఢీకొంది. ఈ క్రమంలో ఒకటి రెండు కార్లు ఢీకొన్నాయి. మూడు కార్ల వెనక భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎటువంటి గాయాలు కాలేదు. పెను ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన తర్వాత వేరే కారులో జగన్ ఇడుపులపాయలోని ఎస్టేట్‌కు చేరుకున్నారు.