»Dont Panic When Elections Come Kcr In Kothagudem Praja Ashirwada Sabha
CM KCR: ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు.. కొత్తగూడెం ప్రజాఆశీర్వాద సభలో కేసీఆర్
ఎన్నికల సమయంలో ప్రజలు మోసపోవద్దని, అభ్యర్థిని చూసి కాకుండా ఆ పార్టీ చరిత్రలను చూసి ఓటేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. కొత్తగూడ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్లొని ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటైన 10 ఏళ్లలో బీఆర్ఎస్ అన్ని రంగాలను ముందుకు తీసుకొచ్చిందన్నారు. ఆగమాగం కాకుండా ఆలోచించి ఓట్లేసి మళ్లీ బీఆర్ఎస్నే అధికారంలోకి తీసుకురావాలన్నారు.
ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దని తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ (CM KCR) అన్నారు. నేడు కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించింది. ఈ సభకు సీఎం కేసీఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధమన్నారు. ప్రజలు ప్రతీ పార్టీ అభ్యర్థుల గురించి తెలుసుకుని ఓటేయాలన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక సింగరేణి (Singareni)లో మంచి ఆదాయం వచ్చిందన్నారు. సింగరేణి పరిధిలో 22 వేల మందికి పట్టాలిచ్చామన్నారు.
గతంలో సింగరేణి కార్మికులకు రూ.50 కోట్ల నుంచి రూ.70 కోట్ల వరకూ బోనస్ ఇచ్చేవారని, అయితే ఈసారి దసరా బోనస్‌గా (Bonus) సింగరేణి కార్మికులకు రూ.700 కోట్లను బోనస్‌గా ఇచ్చినట్లు తెలిపారు. సింగరేణి అనేది తెలంగాణ ఆస్తి అని అన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాలను అభివృద్ధి చేశామన్నారు. రాష్ట్రంలో తమ ఆకాంక్షను నెరవేర్చిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ సాధించలేనిది బీఆర్ఎస్ 10 ఏళ్లలో సాధించిందన్నారు.
కాంగ్రెస్ (Congress) హయాంలో సింగరేణిపై అప్పులు తెచ్చి తీర్చలేదని కేసీఆర్ వాపోయారు. దాని వల్ల కేంద్రానికి వాటా వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపుగా 49 శాతం కేంద్రానికి వాటాగా వెళ్లిందని, దాని వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోయినట్లు గుర్తు చేశారు. ఎన్నికలప్పుడు అభ్యర్థుల గుణాలేంటో, వారి పాలన ఎలా ఉందో సరిచూడాలని, అన్నీ ఆలోచించి ఓట్లు వేయాలని సూచించారు. కార్మికులు చనిపోతే రూ.10 లక్షలును బీఆర్ఎస్ ఇస్తోందని, మెడికల్ కాలేజీలు కూడా ప్రతి జిల్లాలకు వచ్చాయని, డయాలసిస్ సెంటర్లను అందరికీ అందుబాటులో ఉంచామని సీఎం కేసీఆర్ అన్నారు.
ఇతర పార్టీల హామీలను చూసి మోసపోవద్దని కేసీఆర్ సూచించారు. ప్రజాస్వామ్యంలో పరిణితి రావాలని, ఎన్నికలప్పుడు అన్ని పార్టీలు తమ అభ్యర్థులను మంచి వారిగా చెబుతారని, కానీ ఏ పార్టీ ప్రజలకు ఎంత మంచి చేసిందో సరిచూసుకోని ఓటు వేయాలన్నారు. తెలంగాణ (Telangana) ఏర్పాటయ్యాక భూగర్భ జలాలను ఏర్పాటు చేశామని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగిందని, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి అనేది సాధ్యమైందన్నారు. అభ్యర్థుల కంటే పార్టీల చరిత్ర చూసి ఓటేయాలని కేసీఆర్ ప్రజలకు సూచించారు.