AFG vs SL: మరో సంచలనం.. శ్రీలంకపై ఆఫ్ఘనిస్తాన్ ఘన విజయం
నేటి వరల్డ్ కప్ మ్యాచ్‌లో శ్రీలంకను ఆఫ్ఘన్ జట్టు ఓడించింది. ఈ విజయంతో ఆఫ్ఘన్ జట్టు పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. ఆఫ్ఘన్ సెమీస్ ఆశలు సజీవంగా నిలిచాయి.
నేడు జరిగిన వన్డే వరల్డ్ కప్ (ODI World Cup-2023) టోర్నీలో శ్రీలంక (Sri Lanka)పై ఆఫ్ఘనిస్తాన్ (Afghanistaan) ఘన విజయం సాధించింది. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో ఆఫ్ఘన్‌కు ఇది మూడో విజయం కావడంతో టీమ్ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది వరకూ పాకిస్తాన్, ఇంగ్లండ్ టీమ్స్‌ను ఆఫ్ఘన్ మట్టికరిపించింది. నేడు శ్రీలంకతో విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి ఆఫ్ఘన్ చేరుకుంది. దీంతో సెమీస్ ఆశలను సజీవంగా నింపుకుంది.
మొదట బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక 242 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఆఫ్ఘన్ 3 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. ఆఫ్ఘన్ బ్యాటర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ 73 పరుగులు, రహ్మత్ షా 62 పరుగులు, హష్మతుల్లా షాహిదీ 58 పరుగులు చేశారు. ఆ తర్వాత ఇబ్రహీం జద్రాన్ 39 పరుగులతో రాణించాడు. శ్రీలంక బౌలర్లలో దిల్షన్ మధుశంక 2 వికెట్లు పడగొట్టాడు. మరో బౌలర్ కసున్ రజిత ఓ వికెట్ తీశాడు.