Ashok Gehlot: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ గెహ్లాట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) కేసులో వైభవ్ గెహ్లాట్‌ను ఈడీ విచారణకు పిలిచింది. నిజానికి ఆయన అక్టోబర్ 27న ఈడీ ముందు హాజరు కావాల్సి ఉండగా అక్టోబర్ 30న హాజరు అవుతానని సమయం కోరారు. ఫెమా నిబంధనల ప్రకారం వైభవ్ గెహ్లాట్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు పంపింది. ఢిల్లీలోని ఏపీజే అబ్దుల్ కలాం రోడ్లో ఉన్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని కోరింది.
ఈడీ జారీ చేసిన సమన్లు ’ట్రిటన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్’కి సంబంధించినవి. ఇది కాకుండా, వార్ధా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ డైరెక్టర్లు, ప్రమోటర్లపై కూడా ఈడీ ఇటీవల దాడులు నిర్వహించింది. ప్రమోటర్ శివశంకర్ శర్మ, రతన్ కాంత్ శర్మ, ఇతరులను విచారించిన తర్వాత మాత్రమే వైభవ్ గెహ్లాట్‌కు సమన్లు జారీ చేయబడ్డాయి. ఆగస్టు నెలలో ఈడీ ముంబై, ఢిల్లీ, ఉదయపూర్, జైపూర్లలో వార్ధా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ గ్రూప్, దాని ప్రమోటర్‌కు చెందిన పలు ప్రాంతాల్లో దాడి చేసింది. వైభవ్ గెహ్లాట్, రతన్ కాంత్ శర్మల మధ్య సంబంధం ఉన్నట్లు విచారణలో తేలింది. ఫెమా కింద విచారణ నిమిత్తం వైభవ్ గెహ్లాట్ ను ఈడీ పిలిచింది. రతన్ కాంత్ శర్మ, వైభవ్ గెహ్లాట్ కార్ రెంటల్ కంపెనీలో భాగస్వాములు. అయితే, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ పార్టీ.. ఈడీ సమన్లను రాజకీయ ప్రేరేపిత చర్యగా అభివర్ణించారు.
సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తన కుమారుడికి సమన్లు జారీ చేయడంపై సమాచారం ఇస్తూ అశోక్ గెహ్లాట్, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (ఫెమా) కేసులో ఈడీ ముందు హాజరు కావాలని వైభవ్ గెహ్లాట్‌ను కోరినట్లు చెప్పారు. దర్యాప్తు సంస్థ పంపిన సమన్ల సమయానికి సంబంధించిన ప్రశ్నలను కూడా ఆయన లేవనెత్తారు. 200 సీట్ల రాజస్థాన్ అసెంబ్లీకి నవంబర్ 25న ఓటింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది.